Friday, December 20, 2024

సింగరేణిని ప్రైవేటీకరించం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పెద్దపల్లి/గోదావరిఖని/జ్యోతినగర్ : సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.. మెజార్టీ వాటా రాష్ట్రానిది.. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలా విక్రయిస్తుంది. ఇదంతా తప్పుడు ప్రచారం.. నిజం కాదు.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదు అని మోడీ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదికగా మోడీ 6338 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)ను వేదిక నుంచి జాతికి అంకితం చేశారు.

ఇదే వేదిక నుంచి ప్రధాని మోడీ రూ.2,268 కోట్లతో చేపట్టే మెదక్‌సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే విస్తరణ పను లు, బోధన్-బాసర-భైంసా హైవే పనులకు, సిరొంచామహాదేవ్‌పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ ప్రాంతంలో ప్రా రంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు మేలు చేసే ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణలోని 70 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఎల్‌ఈడి స్క్రీన్ల ద్వారా రైతులు తిలకిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల వ్యవసా యం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి సాధించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక పరిపుష్టి సాధిస్తామని ప్రధాని పేర్కొన్నారు.

గత 8 సంవత్సరాల కాలంలో దేశంలో అన్ని రంగాలలో అద్భుతమైన పురోగతి సాధించిందని, వాటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నమ్మకం సాధించామన్నారు. ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత దేశం త్వరలో ఎదుగుతుందని ప్రపంచ మేధావులు అంఛనా వేశారని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ నూతన కార్యక్రమాల పనులు సమాంతరంగా చేపడుతున్నామని, 2030 నాటికి అనేక రంగాలలో ఏర్పరుచుకున్న లక్షాలను పూర్తి చేసే దిశగా కొనసాగుతున్నామన్నారు.

భవిష్యత్‌లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్..

ఎరువుల కర్మాగారం, రైల్వేలైన్, రోడ్ల విస్తరణతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ అభిలాషించారు. అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కూడా లభించాయన్నారు. కొత్త ప్రాజెక్టులతో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అభివృద్ధి పనుల మంజూరు ప్రక్రియలో వేగం పెంచాం. మేం శంకుస్థాపనలకే పరిమితం కాలేదు, వాటిని వేగంగా పూర్తి చేసి చూపించాం. రామగుండం ఎరువుల కర్మాగారానికి 2016లో శంకుస్థాపన చేశాం. కర్మాగారాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. యూరియాను విదేశాల నుంచి అధిక ధరకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయినా.. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టాం. 5 ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతోంది. తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామన్నారు. నానో యూరియా టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి తెచ్చాం. 2014కంటే ముందు యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులు పడేవాళ్లు.

మేం అధికారంలోకి వచ్చాక యూరియా కొరత లేకుండా చూశాం. భవిష్యత్‌లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుంది. మేం తీసుకున్న చర్యలతో యూరియా నల్లబజారు మార్కెట్ బంద్ అయ్యింది. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నాం. నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టాం. ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 5 పెద్ద కర్మాగారాలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత దేశంలో పెంచలేదని, ప్రతి యూరియాపై రూ.1472, డిపిఎ బ్యాగ్‌పై రూ.2500 రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. నూతనంగా శంకుస్థాపన చేసిన జాతీయ రహాదారుల విస్తరణ పనుల ద్వారా హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు, పసుపు మిర్చి రైతులకు ఉపయోగపడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. దేశ అభివృద్ధిపై అందరం దృష్టి సారించి ముందుకు సాగాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమ కోసం మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, 1340 ఉన్న ధాన్యం మద్ధతు ధరను రూ.2040కు పెంచిందని, గత సంవత్సరం 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి కొనుగోలు చేశామన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 2511 మీటర్ల ఉన్న జాతీయ రహదారులకు అదనంగా గత 8 సంవత్సరాలలో 2489 కిలోమీటర్ల జాతీయ రహదారులను నూతనంగా ఏర్పాటు చేశామని, రామగుండం ప్రాంతంలో 1600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ 4వేల కోట్లతో చేపట్టిందన్నారు.

మధ్యాహ్నం 3.20గంటల సమాయానికి రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ప్రధాన మంత్రి ల్యాండింగ్ అయి అక్కడి నుంచి రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)ను సందర్శించారు. అనంతరం ఎన్టీపీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, భగవాన్ కుబా, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ సిఈవో ఎకె జైన్, కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణ, దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News