Monday, December 23, 2024

బొగ్గు సరఫరాపై… సింగరేణి – ఎన్‌టిపిసి మధ్య 4 కీలక ఒప్పందాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ఎన్‌టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో
సిఎండి ఎన్. శ్రీధర్ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె. ఆల్విన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక ఒప్పందలపై సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కె. సూర్యనారాయణ, ఎన్టీపీసీ సౌత్ అండ్ వెస్ట్రన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేభశిష్ ఛటోపాధ్యాయ సంతకాలు చేశారు.

4 కీలక ఒప్పందాల విశేషాలు ఇవీ..
ఎన్‌టిపిసి వారు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న కుడిగీ 2 x 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సింగరేణి సంస్థ ఏడాదికి 67.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయడం కోసం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి రానుంది. అలాగే ఎన్టీపీసీ వారు మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్వహిస్తున్న 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలో గల బొగ్గు సరఫరా ఒప్పందాన్ని పెంచుతూ ఏడాదికి 28.2 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మరో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు జరిపినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. కాగా ముందస్తు చెల్లింపులకు మరో ఒప్పందం కుదిరింది. సాధారణంగా వినియోగదారులు బొగ్గును స్వీకరించిన తర్వాత దానికి సంబంధించిన చెల్లింపులు జరుపుకుంటారు. కాగా సోమవారం జరిగిన ఒప్పందంలో ఎన్టీపీసీ వారు రామగుండం లోని తమ ప్లాంట్ సరఫరా చేసే బొగ్గుకు ముందుగా అడ్వాన్స్ చెల్లింపులకు అంగీకరిస్తూ సింగరేణి తో మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీపీసీ వారు ఈ ప్లాంట్ కు ప్రతినెలా సుమారు 85 నుండి 90 లక్షల టన్నుల బొగ్గు స్వీకరిస్తుంటారు. ఇరుపక్షాలకు లాభదాయకంగా ఈ ఒప్పందం ఉండగలదని అధికారులు వెల్లడించారు. ఇక 4వ ఒప్పందం ప్రకారం ఎన్టీపీసీ సంస్థ సింగరేణి నుంచి కొనుగోలు చేస్తున్న మొత్తం 207.7 లక్షల టన్నుల బొగ్గును, తాను నిర్వహిస్తున్న మూడు ప్లాంట్లలో అక్కడి అవసరాన్ని బట్టి ఏ ప్లాంటుకైనా సరే స్వీకరించడానికి లేదా మళ్ళించడానికి అవకాశం కల్పిస్తూ ఫ్లెక్సీ (వెసులుబాటు) అంగీకారం జరిగింది.

పై నాలుగు ఒప్పందాల వల్ల సింగరేణికి ఎన్టీపీసీ కి కూడా ప్రయోజనం చేకూరనున్నదని, ఇంధన సరఫరా ఒప్పందాలకు అదనంగా ఈ తరహా ఒప్పందాలు జరగడం సింగరేణిలో ఇదే ప్రథమం అని, మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో ఇటువంటి ఒప్పందాలు ఇరు వర్గాలకు మేలు చేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి నుండి ఏజీఎం మార్కెటింగ్ ఎన్. రాజశేఖర్ రావు, డీజీఎం టి. శ్రీనివాస్, డీజీఎం కోల్ మూమెంట్ ఎస్. సంజయ్, డీజీఎం మార్కెటింగ్ సురేంద్ర రాజు, అడిషనల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, ఎన్టీపీసీ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ ప్రదీప్ కుమార్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News