Tuesday, April 29, 2025

సిరులొలికిస్తున్న సింగరేణి

- Advertisement -
- Advertisement -

కోలిండియా సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బొగ్గు ఉత్పత్తి సంస్థలు వేటిల్లో లేని విధంగా ఉద్యోగులకు ఏటేటా లాభాల్లో వాటా అందజేస్తున్న ఏకైక సంస్థ సింగరేణి. ఆర్థిక సంవత్సరం పూర్తి అయి దసరా సీజన్ వచ్చిందంటే సింగరేణి ప్రాంతంలో లాభాల బోనస్ ఒక హాట్ టాపిక్. రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకటించగానే ఇక రాష్ట్రవ్యాప్తంగా అది చర్చనీయాంశం. లాభాల ప్రకటన వాటా నిర్ణయం అన్నింటికీ కీలకం ఉత్పత్తి లక్ష్యసాధన.ప్రతి సంవత్సరం లాగే గత ఆర్థిక సంవత్సరం 2024 -25 లోనూ లక్ష్యానికి చేరువగా ఉత్పత్తి, రవాణా సాధించింది. సింగరేణిలోనే 202324 గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించగా ఈసారి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిఎండి సమర్థనాయకత్వం రాష్ట్రప్రభుత్వ సహకారంతో అంతకుమించి లాభాలు రానున్నట్లు అంచనా.

అదే జరిగితే ఈసారి కూడా బొగ్గుబాయి ఉద్యోగులు భారీగా లాభాల బోనస్ పొందనున్నారు. 1889లో బ్రిటిష్… నైజాం సర్కార్ సంయుక్తంగా దక్కన్ కంపెనీగా ప్రారంభమై 1920 డిసెంబర్‌లో సింగరేణి కాలరీస్ కంపెనీగా రూపాంతరం చెందింది. తెలంగాణ మాగానాల్లో పురుడు పోసుకొని తెలంగాణ చరిత్రలో ఒక భాగమై.. ఉద్యోగులకు కన్నతల్లి కంటే ఎక్కువగా గుర్తింపుపొందింది. తన 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో అనేక విజయాలు సాధిస్తూ రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వరంగ సంస్థగా లాభాల్లో కొనసాగుతున్నది. సంస్థ ప్రారంభం నాటినుండి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు, డివిడెంట్లు, రాయల్టీల రూపకంగా ఆదాయాన్ని సమకూరుస్తూ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తుంది.కాలానుగుణంగా యాంత్రీకరణను సద్వినియోగ పరుచుకుంటూ నేటికీ ప్రత్యక్షంగా 40 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణ కొంగుబంగారంగా నిలుస్తున్నది సింగరేణి. కేవలం ఉపాధి కల్పించడం మాత్రమే కాదు ఏటేటా లాభాల వాటగా సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులకు వాటా చెల్లిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతుంది. దివాలా స్థితినుంచి లాభాల్లోకి 1990 దశకంలో సింగరేణి మనగడకు సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రెండుసార్లు బిఐఎఫ్‌ఆర్ వరకు వెళ్లి దాదాపుగా సంస్థ మూసివేత పరిస్థితిలు నెలకొన్నాయి.

అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర మంత్రి, పెద్దపల్లి ఎంపీ ‘కాకా’ గడ్డం వెంకటస్వామి 1000 కోట్ల అప్పుగా అందించి సంస్థ నిలదొక్కుకునేందుకు అండగా నిలిచింది. అనతికాలంలోనే అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించడమేకాక లాభాల్లోకి అడుగిడింది సింగరేణి.అయితే అప్పటి రాష్ట్ర సర్కారు అకారణ సమ్మెలతో సంస్థ మనుగడకే కష్టం, సంస్థకు లాభాలు వస్తే అందులో వాటా చెల్లిస్తామన్న ప్రకటనను సీరియస్‌గా తీసుకున్న సింగరేణి ఉద్యోగులు ఒక కుటుంబంగా శ్రమించి మూసివేతకు దగ్గరపడ్డ సంస్థను 1998- 1999 ఆర్థిక సంవత్సరానికి లాభాల్లోకి తీసుకొచ్చారు. దీంతో అప్పటి యూనియన్ నాయకులు రాష్ట్రప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని ఒత్తిడి చేయడంతో తొలిసారి 10% లాభాల బోనస్ 1999 నుంచి ప్రారంభమైంది. ఇక నాటినుంచి ఏటేటా లాభాలు ఆర్జిస్తూ ఉద్యోగులకు కంపెనీ లాభాల్లో రాష్ట్రప్రభుత్వం అంగీకారంతో వాటా శాతం పెంచుతూ ముందుకు సాగుతుంది సింగరేణి.

సిఎండిగా తొలి ఏడాది లక్ష్యం సాధన, ఉద్యోగులకు భారీగా లాభాల బోనస్ 2024 జనవరిలో అప్పటివరకు సంస్థ డైరెక్టర్‌గా కొనసాగుతున్న బలరాం నాయక్ (ఐఆర్‌ఎస్)ను సింగరేణి సిఎండిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ సర్కార్. అప్పటికే డైరెక్టర్‌గా సంస్థ అభివృద్ధికి లక్ష్యసాధనకు తీవ్రంగా కృషిచేసిన బలరాం నాయక్ నాయకత్వంలో తొలి ఏడాదిలోనే సింగరేణి సంస్థ 2023 2024 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడమే కాక భారీగా లాభాలను ఆర్జించింది. రూ. 4701 కోట్ల నికర లాభాలు ఆర్జించి అందులో రూ. 2289 కోట్లు సంస్థ విస్తరణకు పక్కకుపెట్ట్టి మిగిలిన రూ. 2412 కోట్లలో 33% ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వ అంగీకారంతో లాభాల బోనస్ చెల్లించింది.

2023- 2024 ఆర్థిక సంవత్సరం కేవలం మూడు నెలలు సిఎండిగా ఉన్నా ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనలో కీలకంగా వ్యవహరించిన బలరాం నాయకత్వంలోని సింగరేణి సంస్థ 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నులను ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించింది. కాగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ప్రారంభంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఉత్పత్తి కీలకమైన ఓపెన్ కాస్ట్ గనుల్లో చాలారోజులు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం, సరైన వర్కింగ్ ప్లేస్‌లు లేకపోవడంతో కేవలం 69.01% మాత్రమే ఉత్పత్తిని సాధించింది. సత్ఫలితాలు ఇచ్చిన సిఎండి బలరాం క్షేత్రస్థాయి పర్యటనలు ఈసారి బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యసాధనలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ఆర్థిక సంవత్సరం చివరి దశలో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించారు. నేరుగా ఉద్యోగుల వద్దకే వెళ్లి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకొని ఉత్పత్తి లక్ష్యసాధన తద్వారా సంస్థ మనుగడపై అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తి నింపారు.

ఆయన క్షేత్రస్థాయి పర్యటనల సత్ఫలితాల కారణంగానే సంస్థ టార్గెట్ 72 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఆమడ దూరంలో ఉండాల్సిన పరిస్థితి నుంచి 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో దాదాపుగా 96% ఉత్పత్తి సాధించిగలిగింది. బొగ్గు ఉత్పత్తిలో కొద్దిగా వెనుకబడ్డప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం లాభాలలో విషయంలో ఎలాంటి డోకా లేదు. గత ఆర్థిక సంవత్సరం రూ. 4701 కోట్లు లాభాలు రాగా, ఈసారి అంతకు మించి 5వేల కోట్ల పైనే సంస్థ లాభాలు ఆర్జించనున్నట్లు అందులో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సింగరేణి ఉద్యోగులు భారీగా లాభాల వాటా పొందనున్నట్లు అంచనా.

రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో సింగరేణి విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంపూర్ణ సహకారాలతో సింగరేణికి రావాల్సిన బకాయిలలో రూ. 1200 కోట్లు సాధించడమే కాకుండా సంస్థ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నారు బలరాం నాయక్. 2016 లోనే నైనీ బ్లాకు వేలంలో దక్కించుకొని ప్రారంభానికి మీనమేషాలు లెక్కిస్తున్న దశలో స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి స్వల్పకాలంలోనే అన్ని రకాల అనుమతులతో ఇటీవలే ప్రారంభించారు. ఏటా కోటి టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధనతో దాదాపుగా 38 ఏళ్లు నైనీ బ్లాక్ కొనసాగునుంది. సింగరేణి పరిధిలో ఇంకా 150 ఏళ్లకు సరిపడ బొగ్గు నిక్షేపాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇతర బ్లాక్స్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్‌లు వేలంలో దక్కించుకొని సంస్థ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రదీప్ రావ్ 99660 89696

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News