Friday, November 15, 2024

సింగరేణి మరో సారి రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సింగరేణి సంస్థ మరో సారి రికార్డు నెలకొల్పింది. రెండ్రోజుల క్రితం 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి చేసి తన రికార్డునే తనే తిరగరాసుకుంది. అంతే కాదు బొగ్గు సరఫరాలోనూ మరో రికార్డను నెలకొల్పడం విశేషం. మొన్న ఒక్క రోజునే సింగరేణి సంస్థ 2.35 లక్షల టన్నలు బొగ్గు సరఫరా చేసింది. ఈ విషయాన్ని సింగరేణి సంస్థ సిఎండి ఎం. శ్రీధర్ సింగరేణి కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పని చేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఫలితంగా నేడు అనేక విధాలుగా కార్మికులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం ఉద్యోగుల బాగోగులపై స్పందిస్తూ … సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరములకు ప్రభుత్వం ఇప్పటికే పెంచిందన్నారు. ప్రమాద వశాత్తూ మృతి చెందిన కార్మికునికి కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను 10 రెట్లు పెంచి చెల్లిస్తున్నదని, గతంలో ఒక లక్ష రూపాయలుగా ఉన్న ఈ మ్యాచింగ్ గ్రాంట్‌ను ఇప్పుడు 10 లక్షల రూపాయలకు పెంచి చెల్లిస్తోందన్నారు.

కాగా డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ , ఎంఎంసి కి బదులు గతంలో ఏక మొత్తంగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని 25 లక్షల రూపాయలకు పెంచడం గమనార్హం అన్నారు. కార్మికుల స్వంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రుణం వరకు సింగరేణి వడ్డీ చెల్లించే పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రుణం వరకు సింగరేణి వడ్డీ చెల్లించే పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదని వివరించారు. సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తోందన్నారు. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికుల కాలనీల్లోని క్వార్టర్లకు ఏసి సౌకర్యం కోసం కంపెనీ చర్యలు తీసుకుందని వెల్లడించారు. కాగా ఐఐటి, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కంపెనీయే చెల్లిస్తోందని వివరించారు.

మెడికల్ అన్ ఫిట్ ద్వారా ఉద్యోగం వద్దనుకునే ఉద్యోగులకు ఏక మొత్తంగా 25 లక్షల రూపాయలు చెల్లింపు లేదా నెలకు 26,293 వేల రూపాయలు చెల్లించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. మహిళ ఉద్యోగినులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచడంతో పాటు అలాగే వారికి చైల్డ్ కేర్ లీవు ఇవ్వటం గమనార్హం అని వివరించారు. కార్మికులు చెల్లించే విద్యుత్తు బిల్లును ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేయటం జరుగుతోందని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.కాగా ఇప్పటికే 9,444 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూర్లుగా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అంతే కాదు ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అద్భుతమైన పోరాటం చేసిన సింగరేణి ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్‌ను మంజూరు చేసిందన్నారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి లాభాల బోనస్‌ను సంస్థ భారీగా పెంచి కార్మికులకు పంపిణీ చేసిందని సింగరేణి సంస్థ సిఎండి ఎం. శ్రీధర్ గుర్తు చేశారు. 2014లో 18 శాతంగా ఉండగా దీనిని 2015లో 21 శాతానికి అలాగే 2016లో 23 శాతానికి పెంచిందన్నారు. ఇలా ఏటా పెంచుతూ 2017లో 25 శాతం, 2018లో 27 శాతం , 2019లో 28 శాతం, 2020లో 28 శాతం, 2021లో 29 శాతం, 2022లో 30 శాతంగా పంపిణీ చేశామన్నారు. అటు బొగ్గు ఉత్పత్తిలోనూ సింగరేణి కీలక భూమిక పొషిస్తోంది.

సింగరేణిలో ఏటా మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , కర్నాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5661 మెగావాట్లు ఉండగా, 2022 మార్చి నాటికి 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్తు ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయటం చాలా ముఖ్యం కావడంతో అందుకే నాలుగు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్రాన్ని కోరారని సింగరేణి సంస్థ సిఎండి ఎం. శ్రీధర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News