Thursday, January 23, 2025

అన్ని రంగాల్లోనూ సింగరేణి గణనీయమైన వృద్ధి

- Advertisement -
- Advertisement -

దేశంలోనే అత్యుత్తమ ప్లాంటుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
9,353 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి
8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్ తెలంగాణకే సరఫరా…
థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమ పిఎల్‌ఎఫ్‌తో అగ్రస్థానంలో…
2021,22 ఆర్థిక సంవత్సరంలో పలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక

Singareni seen significant growth in all sectors

మనతెలంగాణ/హైదరాబాద్:  గతేడాదితో పోలిస్తే సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం అన్ని విషయాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశంలోనే అత్యుత్తమ ప్లాంటుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నిలిచింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2021,22 ఆర్థిక సంవత్సరంలో 9,353 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి 8,808 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర పవర్ గ్రిడ్ కు సరఫరా చేసింది. 2021,22లో దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమ పిఎల్‌ఎఫ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. 2021 నవంబర్, 2022 మార్చిలో నూరు శాతం పిఎల్‌ఎఫ్‌ను సాధించింది. ప్లాంట్ నిర్వహణలో బెస్ట్ పవర్ ప్లాంట్, బెస్ట్ వాటర్ ఎఫిషీయెన్సీ ప్లాంట్ అవార్డు, బెస్ట్ ఫ్లైయాష్ యుటిలైజేషన్ ప్లాంట్ వంటి పలు జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 48,448 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా దానిలో 45,537 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు అందించగలిగింది.

సోలార్ ప్లాంట్ల ద్వారా రూ.130 కోట్ల…

సింగరేణి వ్యాప్తంగా 8 చోట్ల నెలకొల్పిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మార్చి 31వ తేదీ నాటికి 266.37 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. తద్వారా సింగరేణి సంస్థ చెల్లిస్తున్న విద్యుత్ బిల్లుల్లో 130.20 కోట్ల రూపాయల వరకు ఆదా జరిగింది.

రానున్న ఆర్థిక సంవత్సరంలో 700 లక్షల టన్నులు…

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మార్చి 31వ తేదీతో బొగ్గు ఉత్పత్తిలో అనేక రికార్డులు నెలకొల్పింది. తన పదమూడు దశాబ్దాల చరిత్రలో అత్యధికంగా 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డుగా 26 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో (2022-,23) 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించడంతో పాటు రూ.30 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించాలని సింగరేణి ప్రణాళికలు రూపొందిస్తోంది.

కోల్ ఇండియాతో పోల్చినప్పుడు..

2020-, 21 లో 505 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించిన సింగరేణి, (2021, -22) ఆర్థిక సంవత్సరంలో 28.6 శాతం వృద్ధితో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే బొగ్గు రవాణాలో 35 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.4 శాతం వృద్ధిని సాధించింది. అలాగే సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా సుమారు 26 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఇది అంతకు ముందు సంవత్సరం సాధించిన టర్నోవర్ 17,669 కోట్ల రూపాయల కన్నా 47 శాతం అధికం. కోల్ ఇండియాతో పోల్చినప్పుడు కూడా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా వృద్ధి శాతంలో అగ్రగామిగా ఉంది.

తెలంగాణ రాష్ట్రానికి 127.9 లక్షల టన్నుల బొగ్గు

సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన మొత్తం 650 లక్షల టన్నుల బొగ్గులో తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం 127.9 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి అందజేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు 66.69 లక్షల టన్నులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న 16 ఎన్‌టిపిసి విద్యుత్ కేంద్రాలకు 218.87 లక్షల టన్నులు, కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు 82 లక్షల టన్నులు, తమిళనాడు జెన్‌కోకు 25.71 లక్షల టన్నులు, మహారాష్ట్ర జెన్‌కోకు 29.79 లక్షల టన్నులతో పాటు మిగిలిన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మొత్తం కలిపి 536.51 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. తద్వారా దక్షిణ భారతదేశం లోని దాదాపు అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు సింగరేణి బొగ్గును రవాణా చేసి వెలుగులు అందించింది. ఇవి కాక సిమెంట్, సిరామిక్స్, పేపర్, స్పాంజ్ ఐరన్ వంటి ఇతర పరిశ్రమలకు 118.79 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసి ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తులు సాధించడానికి దోహదపడింది.

కష్ట కాలంలో గణనీయమైన ఉత్పత్తి

సింగరేణి సంస్థ 2021, 22 ఆర్థిక సంవత్సరానికి 680 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొని ప్రతినెలా లక్ష్యాలను సాధించడంతో పాటు సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 650 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించింది.

సింగరేణిలోని 12 ఏరియాల్లో

సింగరేణిలోని 12 ఏరియాల్లో కొత్తగూడెం, మణుగూరు, రామగుండం2 ఏరియాలు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా 131.5 లక్షల టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, 119.4 లక్షల టన్నులతో మణుగూరు ఏరియా 2వ స్థానంలో, 84 లక్షల టన్నులతో రామగుండం 2 ఏరియా 3వ స్థానంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News