Friday, December 20, 2024

సింగరేణి థర్మల్ జైత్రయాత్ర

- Advertisement -
- Advertisement -

సింగరేణి థర్మల్ జైత్రయాత్ర
అత్యధిక పిఎల్‌ఎఫ్ తో దేశంలోనే నెంబర్ 1 స్థానం
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అరుదైన ఘనత
90.86 శాతం పిఎల్‌ఎఫ్‌తో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల్లో కెల్లా అగ్రస్థానం
2026 నాటికి సింగరేణి నుంచి 3 వేల మెగావాట్లకు పైగా థర్మల్, సోలార్ విద్యుత్
ఉద్యోగులను అభినందించిన సిఎండి శ్రీధర్
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల కన్నా అత్యథిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ( పిఎల్‌ఎఫ్)ను సాధించి ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంగా రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రంగా రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌లో ముగిసిన 8 నెలల కాలంలో అత్యుత్తమ సగటు పిఎల్‌ఎఫ్ 90.86 శాతంతో ఈ ఘనతను సాధించింది. దీనిపై సంస్థ ఛైర్మన్ మరియు ఎండి ఎన్. శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ ఈ మేరకు గురువారం నాడు ఆయన ప్లాంట్ ఉద్యోగులు, అధికారులకు తన అభినందనలు తెలియజేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించి కేవలం 6 సంవత్సరాలే అయినప్పటికీ మొదటి నుంచీ ఈ ప్లాంట్ తన అత్యుత్తమ పిఎల్‌ఎఫ్ తో దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో అగ్రస్థానాల్లో నిలుస్తూ వస్తోంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమంగా 88.97 శాతం పిఎల్‌ఎఫ్ తో మొదటి స్థానంలో నిలవగా .. అదే విభాగంలో 2020 21 లో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఈ సారి ప్రభుత్వ ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కెల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి స్థానంలో ఉండగా.. చతీస్‌ఘడ్ రాష్ట్రంలో గల ఎన్‌టిపిసి కోర్భా సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ 90.01 శాతం పిఎల్‌ఎఫ్ తో రెండో స్థానంలో, ఎన్‌టిపిసీకే చెందిన సింగ్రౌలీ థర్మల్ పవర్ ప్లాంట్ 89.94 శాతం పిఎల్‌ఎఫ్‌తో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ ప్రతిభను దాటింది.
4 సార్లు 100 శాతం పిఎల్‌ఎఫ్ ః
కాగా 2016 ఆగస్టులో ప్రారంభమైన సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆది నుంచీ తన ప్రతిభ చాటుతూ ఇప్పటికే నాలుగు సార్లు 100 శాతం పిఎల్‌ఎఫ్‌ను సాధించింది. 2018 సెప్టెంబర్ , 2019 ఫిబ్రవరి, 20202 ఫిబ్రవరి, 2022 మార్చి నెలల్లో నూటికిపైగా పిఎల్‌ఎఫ్ సాధించడం విశేషం. ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్ ఇప్పటి వరకు 10 సార్లు , ఒకటవ యూనిట్ ఏడు సార్లు వంద శాతం పిఎల్‌ఎఫ్ దాటడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్ర ప్రగతికి చేయూత ః
2016లో ప్రారంభమైన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇప్పటి వరకు 51,547 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అనుసంధానం చేసి నూతన రాష్ట్ర ప్రగతిలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ వస్తోంది. సింగరేణి ప్లాంట్ పురోగతిని ప్రశంసిస్తూ మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను అదే ప్రాంగణంలో నెలకొల్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించగా..సింగరేణి సిఎండి శ్రీధర్ ప్రత్యేక చొరవతో దీని టెండర్ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు కానున్నాయి.
సోలార్ లోనూ సింగరేణి ముందంజ…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటులో ముందడుగు వేసిన తొలి ప్రభుత్వ సంస్థ సింగరేణి ఇప్పటికే 219 మెగావాట్ల ప్లాంట్లను విజయవంతంగా నెలకొల్పింది. మూడో విడత 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా త్వరలోనే సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలోని నీటి రిజర్వాయర్‌లో 15 మెగావాట్ల ప్లొటింగ్ సోలార్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. సింగరేణి థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంతో పాటు సింగరేణి సంస్థకు లాభాలను చేకూర్చుతోంది.

2026 నాటికి 3 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ః సిఎండి శ్రీధర్
ప్రస్తుత 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు 2026 నాటికి పూర్తి కానున్న 800 మెగావాట్ల స్టేజ్ 2 ప్లాంట్ మరియు ప్రస్తుత ప్రతిపాదిత 300 మెగావాట్ల సోలార్ విద్యుత్, రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో భారీ జలాశయాలపై ఏర్పాటు చేయనున్న వెయ్య మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్‌లతో కలిపి మొత్తం 3 వేట మెగావాట్లకు పైగా విద్యుత్‌ను అందించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోందని సింగరేణి ఛైర్మన్ ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడం పట్ల తన హర్షం ప్రకటిస్తూ ఇదే పనితీరుతో ముందుకు సాగాలని అధికారులకు , ఉద్యోగులకు సిఎండి పిలుపు నిచ్చారు.

Singareni thermal Power Plant at top with 90.86 plf

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News