Sunday, January 19, 2025

అడుగడుగునా నిరసనలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్, వామపక్ష పార్టీలు, కార్మిక, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. పలుచోట్ల మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడటం, సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపడం, ప్రధాని పర్యటనను అడ్డుకుం టామని వామపక్షాలు హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగింది. మోడీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మార్మొగిపోయింది. మోడీ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా ఆర్ట్ కాలేజీ నుంచి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టేందుకు బయలుదేరిన టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులను ఉస్మానియా లా కాలేజీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఓయూలో ఉద్రిక్తతకు దారితీసింది. యూనివర్సిటీ నుంచి విద్యార్థులు బయటికి రాకుండా ఉండేందుకు పోలీసులు గేట్లను మూసివేశారు.

భారీగా పోలీసులను మోహరించి విద్యార్థులను అదుపు చేశారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాగ్‌లింగంపల్లిలో టిఆర్‌ఎస్‌వి కార్యాలయంలో అధ్యక్షుడు రాంబాబు యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్డు వద్ద నిరసన చేపట్టిన సిఐటియూ నాయకులను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టిన ప్రజా సంఘాలను పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని కెబిఆర్ పార్క్ వద్ద తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ నేతలు గాల్లోకి నల్లబెలూన్లు ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే చేనేత వస్త్రాలపై 5శాతం జిఎస్‌టి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జిఎస్‌టిని ఎత్తివేసిన తర్వాతే ప్రధాని మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని అన్నారు. మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. గో బ్యాక్ మోడీ.. నో ఎంట్రీ టూ తెలంగాణ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ప్రధాని మోడీ తెలంగాణ వ్యతిరేకి అని, రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చేనేత యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలిశెట్టి అరవింద్ ఆరోపించారు. దేశంలోని ప్రముఖ ప్రాజెక్టులు అదాని, అంబానీలకు కట్టబెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను హౌస్ అరెస్టు చేశారు. సిపిఐ అనుబంధ సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బేగంపేటలోని ప్రధాని మోదీ బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి పటాన్‌చెరు వద్ద జాతీయ రహదారిపై టిఆర్‌ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో టిఆర్‌ఎస్, వామపక్షాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ముందు నల్ల జెండాలతో టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నిరసనకు దిగింది.

మరోవైపు ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సిపిఐ నేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారు తమ నిరసన ను కొనసాగించారు. హనుమకొండ జిల్లా బీమదేవరపల్లిలో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసు కున్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో టిఆర్‌ఎస్, సిపిఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ఖమ్మంలో ఆందోళనకు దిగిన వామపక్ష శ్రేణులు గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇక, గోదావరిఖని 11వ గని వద్ద ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యను, ఇతర నాయకులను అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా కోల్‌బెల్ట్ ప్రాంతంలో పలుచోట్ల కార్మికులు ఆందోళనలు చేపట్టారు. మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, గోదావరిఖని, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లజెండాలను ఎగురవేశారు. మోడీ గో బ్యాక్ అంటూ నినదించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News