సత్ఫలితాలనిచ్చిన సింగరేణి ప్రత్యేక శిబిరాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సంస్థ సమీప గ్రామాల్లోని యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇటీవల 10 ఏరియాల్లో నిర్వహించిన ఫ్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిబిరాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. సికింద్రాబాద్‌కు సమీపంలోని హకీంపేటలో మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకుల్లో 96 మంది శరీరధారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అనంతరం జరిగిన మెడికల్ పరీక్షలో వీరి నుండి 73 మంది ఉత్తీర్ణులై ఫైనల్ రాత పరీక్షకు ఎంపికయ్యారు. దీనిపై సేవా సమితి ఉపాధ్యక్షులు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ కె.సూర్యనారాయణ సేవా సమితి సింగరేణి వ్యాప్త చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ మహేష్‌లు హర్షం వ్యక్తం చేశారు.
ప్రాథమిక పరీక్షల్లో ఎంపికైన 73 మంది మే నేలలో జరగనున్న రాత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కోవిడ్ వ్యాది తిరిగి ఉధృతమవుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈ ఏడాది సింగరేణి సంస్థ రాత పరీక్ష నిర్వహించలేకపోతోందని అయితే అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా సహకరించనున్నామని తెలిపారు. ఎంపికైన 73 మందిలో జనరల్ డ్యూటీ సోల్జర్ విభాగానికి 41 మంది, ట్రేడ్స్‌మెన్ విభాగానికి 27 మంది, నర్సింగ్, క్లర్కుల విభాగానికి ఐదుగురు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో 5 గురు కార్మిక కుటుంబాల నుండి రాగా మిగిలిన వారంతా సమీప గ్రామాలు, పట్టణాలకు చెందిన రైతు, రైతు కూలీ కుటుంబాలకు చెందినవారే. రాత పరీక్షలో కూడా దాదాపు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు అవుతారని భావిస్తున్నారు.
నెల ఇరవై రోజుల పాటు ఏరియాల్లో ఉచిత శిక్షణ
సింగరేణి సమీప పట్టణాలు, పల్లెల్లోని నిరుద్యోగులైన యువకులకు వివిధ రకాల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇస్తున్న సింగరేణి సంస్థ ఆర్మీ పట్ల ఆసక్తి గల అభ్యర్థులకు దీనికలో చేరడానికి ప్రతి ఏడాది ఉచిత శిక్షణ శిబిరాలను గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ శిక్షణ శిబిరాల వలన ఇప్పటికే సుమారు పదకొండు వందల మందికి పైగా యువకులు ఆర్మీలో ఉద్యోగాలు సాధించారు. వీళ్లతా దేశంలోని వివిధ ప్రాంతాలలో, దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లనను స్ఫూర్తిగా తీసుకున్న సింగరేణి ప్రాంతంలోని ఇతర నిరుద్యోగ యువకులు సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలకు తరలివస్తూ ఉచిత శిక్షణ పొందుతున్నారు. గతేడాది సంస్థ చైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ సూచన మేరకు తొలిసారిగా మూడు నెలల పాటు రెసిడెన్షియల్ రతహా శిక్షణను కూడా సింగరేణి సేవా సమితి ద్వారా అందించారు. 300 మందిని ఎంపి చేసి భోజన వసతులు సమకూర్చి శిక్షణనిచ్చారు. ఫలితంగా గతేడాది జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 272 మంది యువకులు పాల్గొనగా వీరిలో శరీర దారుఢ్య పరీక్షల్లో 162 మంది ఉత్తీర్ణులు కాగా తదుపరి వైద్య పరీక్షల్లో 114 మంది పాసయ్యారు.
ఆ తర్వాత జరిగిన రాతపరీక్షలోల 35 మంది విజయులై ఉద్యోగాలు సాధించారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాధి నేపథ్యంలో రోజూవారీగా ఉదయం, సాయంత్రం శరీర దారుఢ్యం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 500 మంది యువకులు ఈ శిబిరాలలో పాల్గొన్నారు. వీరిలో ప్రధానంగా సమీప గ్రామాలకు పట్టణాలకు చెందిన రైతులు, నిరుద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు కొందరు ఉన్నారు. హకీంపేటలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో వీరంతా పాల్గొనడం కోసం సింగరేణి సంస్థ ఈ ప్రాంతానికి సమీపంలో ఒక హాలుని అద్దెకు తీసుకుని ఉచిత భోజన, వసతి సౌకర్యాన్ని అభ్యర్థులకు కల్పించింది. సేవా సమితి ఇచ్చిన శిక్షణ, కల్పించిన సౌకర్యాల వల్ల ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ చాటారు. శరీర దారుఢ్య, వైద్య పరీక్షల్లో 73 మంది ఎంపికయ్యారు. రాత పరీక్షల్లో కూడా తాము ఎన్నిక అవుతామని, ఉద్యోగాలు సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ తమను సొంత బిడ్డల్లా చూసుకుని ఉచిత శిక్షణ సౌకర్యాలు కల్పించడం పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.