హైదరాబాద్ : ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమంలో రాతిబొమ్మలను సైతం కదిలించిన ఆ గానం మూగబోయింది. స్వరాష్ట్రం కోసం జరిగిన సమరంలో పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు జైకొట్టు తెలంగాణ అని నినదించేలా తట్టిలేపిన ఆ ఆట ఆగిపోయింది. గొంతెత్తి పాటల తూటాలు మోగించినా.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించినా.. గజ్జె కట్టి ధూంధాం చేసినా.. అది తెలంగాణ కోసమే అంటూ సమరోత్సాహాన్ని నింపిన సాయిచంద్.. ఇక ఆటాపాటకు సెలవంటూ వెళ్లిపోవటం తీరని విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణే శ్వాసగా.. నిక్సాన ఉద్యమకారుడిగా చివరి దాకా పోరుబాటలో పయనించిన సాయిచంద్.. ఆకస్మిక మరణం అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది.
సాయిచంద్ హఠాన్మరణం
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వి.సాయిచంద్(39) హఠాన్మరణం చెందారు. బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తరలించగా, గురువారం తెల్లవారు జామున 3 గంటలకు చికిత్స పొందుతూ సాయిచంద్ కన్నుమూశారు. సాయిచంద్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న సాయిచంద్ జన్మించారు. నిరుపేద కుటుంబంలో జన్మించినా.. ఎన్నో కష్టాలకోర్చి పిజి వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచే ఆటాపాటలపై ఉత్సాహంగా ఉండే సాయిచంద్..మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
హైదరాబాద్‌లో చదువుకునే సమయంలోనే విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తూ.. అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించిన సాయిచంద్.. ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొన్న సాయిచంద్.. తన కళా ప్రదర్శనలతో నాటి ఉద్యమనేతలను ఆకర్షించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటి చెప్పారు. 2021 డిసెంబర్‌లో సాయిచంద్ను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. కాగా, సాయిచంద్ మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు.
సాయిచంద్ భౌతికకాయం వద్ద సిఎం కెసిఆర్ భావోద్వేగం
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. గుర్రంగూడలోని నివాసానికి వెళ్లిన సిఎం కెసిఆర్ సాయిచంద్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి కెసిఆర్ కంటతడి పెట్టారు. శోకసంద్రంలో ఉన్న సాయిచంద్ కుటుంబసభ్యులను ఓదార్చుతూ సిఎం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కెసిఆర్ ఎదుట సాయిచంద్ భార్య, తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. సాయిచంద్ భార్య, పిల్లలు కెసిఆర్ కాళ్లపై పడి రోదించారు. ఈ సందర్భంగా…‘ సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్’ అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సిఎంకు కష్టంగా మారింది. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సిఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో కెసిఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సాయిచంద్ తండ్రి వెంకట్‌రాములును ఓదార్చారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు వారికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, మెహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎంఎల్‌సిలు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిదులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాసంఘాల నాయకులు సాయిచంద్‌కు నివాళులర్పించారు. అంతకు ముందు మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావులు సైతం సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం : సిఎం కెసిఆర్
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సిఎం విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సిఎం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సిఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు.తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సిఎం అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు నిలిచిపోతుంది : మంత్రి కెటిఆర్
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కెటిఆర్ అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సాయిచంద్: మంత్రి హరీశ్ రావు
సాయిచంద్ అకాల మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
సాయిచంద్ అకాల మరణం ఎంతో కలచివేసింది : ఎంఎల్‌సి కవిత
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు సాయిచంద్ అని పేర్కొన్నారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. సాయిచంద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
భవిష్యత్ నాయకున్ని కోల్పోయింది: గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకుడిని, భవిష్యత్ నాయకున్ని కోల్పోయిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర విశేషమైనదని తెలిపారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. సాయిచంద్ మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సాయిచంద్ సేవలు చిరస్మరణీయం: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని తెలిపారు.
మరణవార్త తీవ్రంగా కలచివేసింది: మంత్రి గంగుల
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉద్యమానికి ఆయుపట్టుగా సాయిచంద్ స్వరం: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్వరం ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేశారని వెల్లడించారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటని చెప్పారు.
తీవ్రంగా కలచివేసింది: మంత్రి వేముల
సాయిచంద్ మృతిపట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాయిచంద్ మృతి పట్ల గవర్నర్ సంతాపం
ప్రముఖ సాయిచంద్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయిచంద్ అకాల మరణం తీవ్ర ఆవేదన కలిగించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాయిచంద్‌కు తుది వీడ్కోలు పలికిన మంత్రులు, బిఆర్‌ఎస్ శ్రేణులు
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్‌కు మంత్రులు, బిఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గురువారం వనస్థలీపురం సాహెబ్‌నగర్ శ్మశాసనవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, బిఆర్‌ఎస్ నేతలు, కళాకారులు హాజరై ఘన నివాళులర్పించారు.