న్యూఢిల్లీ : వర్షాలు, చలి మంచు తుఫాన్ల కలికాలం, కొవిడ్ వికృత ప్రకృతి వీటన్నింటిని తట్టుకుని ఏడాదిగా రైతు సాగించిన దీక్ష ఫలించింది. పల్లెలు దాటారు, పొలిమేరలు అధిగమించారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోకి చేరుకుని సింఘూ వద్ద చెక్కుచెదరకుండా తిష్టవేసుకున్న రైతు దండు కనబర్చిన స్ఫూర్తి దేశంలోని రైతు విప్లవాన్ని బలోపేతం చేసే ఘట్టం అయింది. అన్నదాతలు వారు ఆకలికి ఓర్చుకున్నారు. పండు ముదుసలిలు కూడా అనారోగ్యాన్ని లెక్కచేయలేదు. కష్టపడి పొలాలలో పండిన జోవర్‌తో రూపొందించుకున్న రోటీలు తిన్నారు. ఊరు కాని ఊరులో తాము పరాయిలం కామని, దేశ సమగ్ర పౌరులమని నిరూపించుకున్నారు.
పలు ఆక్షేపణలు తలెత్తినా ప్రజాస్వామ్యయుతంగా ఢిల్లీలోనే రోటి కపడా ఔర్ మకాన్ స్ఫూర్తిగా నిలిచారు. ఎముకలు కొరికే చలి, దంచికొట్టిన వానలు, గడగడలాడించిన కొవిడ్ ఇవేవీ వారి సంకల్ప బలాన్ని ఈసమెత్తు అయినా దెబ్బతీయలేదు. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో తమపై వచ్చిన రాజకీయ కువిమర్శలను పట్టించుకోకుండా రాత్రిపగలు తేడాలు తెలియకుండా తమ బలీయ ఉనికిని చాటారు. దీనితోనే కేంద్రం దిగొచ్చేలా చేసుకున్నారు. పండుగలు పబ్బాలు జాతరలు అన్ని ఈ ప్రాంతంలోనే వారికి సరికొత్త రీతిలో జరిగాయి.
వీరు రైతులు కాదు రోడ్ల ఆక్రమణదారులు అనే ఆరోపణలు వచ్చాయి. ఇతర పౌరుల హక్కులను హరిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే వీటిని నవ్వుతూ భరిస్తూ, తమ దరిదాపుల్లోకి వచ్చిన కొవిడ్ వైరస్‌ను తట్టుకుని నిలిచి రైతు సత్తాను చాటారు. ఢిల్లీ హర్యానాల మధ్య ఉండే సింఘూ సరిహద్దు రైతుల నిరసనల కేంద్రం అయింది. కేంద్రంపై సత్యాగ్రహంతో ఎక్కుపెట్టిన నిరసన అయింది. ఇక్కడ రైతులు వ్యూహాత్మకంగా ఆరంభించిన ఉద్యమం తరువాత క్రమేపీ ఇతర సరిహద్దులకు విస్తరించింది. చివరికి బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో సెగలకు దారితీసింది. క్రమశిక్షణాయుత కార్యకర్తలు, పెద్దలను సేదతీరుస్తూ దీక్షలలో పాల్గొంటూ వచ్చిన యువ రైతులు ఇక్కడ ఇంతకాలం తమ శక్తిని చాటుకున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే తమకు తిండిపెట్టే పొలం కోసం, పొలంలో సాగే సాగు కోసం అని తమ స్ఫూర్తిని చాటారు. పంజాబ్ నుంచే అత్యధిక సంఖ్యలో రైతులు ఇక్కడికి వచ్చి చేరారు. సరిగ్గా 2020 సంవత్సరం నవంబర్ 26న రైతులు చలో ఢిల్లీ పిలుపుతో తరలివచ్చారు. కొత్త చట్టాల రద్దు ఒక్కటే తమకు సమ్మతం అని ప్రకటించారు.
ఈ చట్టాలతో తమకు కొత్త కష్టాలు వస్తాయని ఆరుగాలాలు కష్టపడి పనిచేసే రైతులను అర్థం కాని చట్టాలతో దగా చేస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతం అంతా ఏడాదిగా క్రమం తప్పకుండా జాతర వాతావరణంతో పోరాట కళను సంతరించుకుంది. ఉద్వేగపు ప్రసంగాలు, సదా హక్, ఐతే రఖ్ అన్నింటికి మించి జో బోలో సో నిహాల్ నినాదాలు మార్మోగాయి. సామూహిక వంటశాలలు లంగర్లు వెలిశాయి. మహిళలు వంటలకు దిగారు.
తిండితినకుండా పోరు సాగుతుందా
ఉద్యమ వేదిక ఆరంభం అయిన తొలిరోజునే ఇక్కడికి వచ్చిన 45 ఏండ్ల పాల్విందర్ సింగ్ ముందు ఇక్కడ వంటశాలను ఏర్పాటు చేశారు. విప్లవం, ఉద్యమాలు ఖాళీ కడుపులతో నడవవు. తిండి తింటేనే కండ కలుగుతుంది. ఉద్యమించే శక్తి ఉంటుందన్నారు. ఈ గురునానక్ జయంతి శుక్రవారం తమకు తీపి వంటల రోజు అని వ్యాఖ్యానించారు.
నిరసనకారులకు కొండంత ఓదార్పులు
ఈ ప్రాంతంలో అలసిసొలిసి ఉండే రైతులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకు పలువురు నిపుణులు కూడా ఇక్కడికి వచ్చారు. పాతికేళ్ల హర్జీవన్ సింగ్ అమెరికాలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వ్యక్తి. రైతులు నిరాశనిస్పృహలకు గురి కాకుండా వారిని ఉల్లాసపర్చే ప్రసంగాలు కార్యక్రమాలకు దిగారు. ఈ ప్రాంతంలో నిరసనలు సాధ్యమైనంతగా అదుపు తప్పకుండా చట్టం ఇక్కడి వారి చేతుల్లోకి పోకుండా చేసేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నారని పలువురు తెలిపారు.