రైతుబంధు ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాకులు చెబుతోందని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సర్కార్ చర్య రైతులను తడిగుడ్డతో గొంతు కోయడమేనని మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి చేతులు దులుపుకోవడం మాత్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతాంగాన్ని పూర్తిగా మోసం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని ఎప్పట్నుంచో చెబుతున్నామని ఆరోపించారు. అన్ని వర్గాలను ఊరించి ఉసూరుమనిపించారని, అన్నదాతలకు ఆగం పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం, మంత్రివర్గంలో చర్చ అయ్యేసరికి వానాకాలం అయిపోతుందని ఆక్షేపించారు. తాము గుట్టలకు ఇచ్చామని దుష్ప్రచారం చేశారని,
రెండు సీజన్లలో ఎందుకు సరి చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్నది శుద్ధ అబద్ధాలు, కుంటి సాకులని, రంధ్రాన్వేషణ పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పిన గొప్పలు అమలు కాని పరిస్థితి ఉందని పాలకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్ల కెసిఆర్ హయాంలో రైతులకు 11 విడతల్లో రూ.72 వేల కోట్ల రైతుబందు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 92 శాతం భూమి ఐదెకరాల లోపు ఉన్న రైతుల చేతుల్లోనే ఉందని, ఆరున్నర నుంచి ఏడు శాతం రైతులకు ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకుల నిర్వాకంతో రెవెన్యూ రికార్డులే సక్రమంగా లేవు అని, కెసిఆర్ హయాంలోనే భూరికార్డుల శుద్ధి జరిగిందని చెప్పారు. కెసిఆర్ హయాంలో రైతులకు జరిగిన మేలును వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
నాకు పార్టీ మారే ఆలోచన లేదు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బిఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని కొంత బాధ అయితే ఉందని.. కానీ పార్టీ మారే ఆలోచన ఏ మాత్రం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే దానిపై సమీక్షా సమావేశాలు నిర్వహించానని తెలిపారు. ఏ మండలం, ఏ గ్రామంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి..? ఎవరు పనిచేశారనే దానిపై సమీక్షలు చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించానని చెప్పారు. కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. దయచేసి తనపై తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.