Wednesday, January 22, 2025

సింగిల్ పిక్ కాటన్

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది 45వేల ఎకరాల్లో సాగుకు ప్రోత్సాహం

మన తెలంగాణ/హైదరాబాద్ : పత్తి సాగులో పూత కాయతోపాటు పంటంతా ఒకేసారి చేతికందివచ్చే రకం పత్తి వంగడం సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్ పై ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై బుధవారం నాడు బీఆర్ కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్పాదకతను పెంపొందించడంతోపాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ పత్తి సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ సింగిల్ పిక్ పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందనీ, పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తిని పంట ను వేస్తున్నారని వివరించారు. ఈ పంట సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున ఈ వానాకాలం సీజన్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సింగిల్‌పిక్ పత్తి సాగు చేయించాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్ నిర్వహించిన ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలని అన్నారు.

ఈ సింగిల్ పిక్ పత్తి వేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రైతులను చైతన్య పర్చాలను సూచించారు. హెచ్‌డిపిఎస్ (హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి, ఈ సింగల్ పిక్ పత్తిని సాగు చేసే రైతుల వివరాలను నమోదు చేయించాలని ఆదేశించారు. దీనికోసం రైతు ప్రొఫైల్, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్ తదితర వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, ప్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డా. ప్రవీణ్‌రావు, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హనుమాన్ కె జెండగే, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News