జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువులను నిషేధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. జులై 1 నుంచి ఈ నిషేధం అమలు లోకి రానున్నది. దీంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలు ఇకనుంచి కనుమరుగు కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో భారీ స్థాయిలో వినియోగించే పాల ఉత్పత్తులు, పండ్ల రసాల టెట్రా ప్యాకుల్లో వాడే స్ట్రాలు కూడా కనిపించకుండా పోనున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా పేపర్‌వి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నా స్ట్రాల నిషేధాన్ని వాయిదా వేయాలని అమూల్ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. అమూల్, పెప్సీ, కోకాకోలా, పార్లే వంటి సంస్థలు ఏటా వందల కోట్ల సంఖ్యలో ఈ ప్లాస్టిక్ స్ట్రాలను వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా రూ.5 నుంచి రూ.30 ప్యాకుల్లో లభించే పాలు, పండ్ల రసాల డబ్బాలకు ప్లాస్టిక్ స్ట్రాలనే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి నిషేధాన్ని వాయిదా వేయాలని కోరుతూ అమూల్‌తోపాటు పార్లే వంటి సంస్థలు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సమాచారం.