ఫైనల్లో జ్వరేవ్ ఓటమి
మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడీ, డిఫెండింగ్ ఛాంపియన్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సిన్నర్ 63,76, 63తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)ని ఓడించాడు. తొలి సెట్ ఆరంభంలో జ్వరేవ్, సిన్నర్ నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఇద్దరు పోటీ పడి ఆడుతూ ముందుకు సాగారు. దీంతో సెట్ ఒక దశలో 33 గేమ్స్‌తో సమంగా నిలిచింది. కానీ, ఆ తర్వాత సిన్నర్ అనూహ్యంగా పుంజుకున్నాడు.
జ్వరేవ్ జోరుకు బ్రేక్ వేస్తూ లక్షం వైపు నడిచాడు. కీలక సమయంలో జ్వరేవ్ ఒత్తిడి గురై వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన సిన్నర్ అలవోకగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా, రెండోసెట్‌లో మాత్రం పోరు హోరాహోరీగా సాగింది. ఈసారి జ్వరేవ్ అద్భుత పోరాట పటమిను కనబరిచాడు. సిన్నర్‌ను హడలెత్తిస్తూ లక్షం దిశగా సాగాడు. అద్భుత షాట్లతో విరుచుకుపడిన జ్వరేవ్ 43 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మరోవైపు సిన్నర్ ఒత్తిడిని తట్టుకుంటూ మళ్లీ పైచేయి సాధించాడు. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మూడో సెట్‌లో మాత్రం సిన్నర్‌కు కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. ఆరంభం నుంచే సిన్నర్ ఆధిపత్యం చెలాయించాడు. తన మార్క్ షాట్లతో అలరించిన సిన్నర్ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి వరుసగా రెండో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
ఓవరాల్‌గా సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేగాక ఆస్ట్రేలియా ఓపెన్‌లో వరుసగా రెండు టైటిళ్లు సాధించిన నాలుగోఆటగాడిగా కూడా సిన్నర్ నిలిచాడు. ఇంతకు ముందు అగస్సీ, ఫెదరర్, జకోవిచ్‌లు ఇలాంటి ఫీట్‌ను సాధించారు. ఇక జ్వరేవ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గతంలో రెండు సార్లు జ్వరేవ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. 2020లో యూఎస్ ఓపెన్, కిందటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జ్వరేవ్‌కు చుక్కెదురైంది. తాజాగా ఈసారి కూడా అదే ఫలితాన్ని చవిచూశాడు. ఈసారి కూడా జ్వరేవ్ గ్రాండ్‌స్లామ్ కల తీరలేదు. కాగా, మహిళల సింగిల్స్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) టైటిల్‌ను సాధించిన సంగతి తెలిసిందే.