గంటల తరబడి శ్రమిస్తేనే నోట్లోకి ఒక ముద్ద. సృజనాత్మక కళాకృతులను ప్రపంచానికి అందించాలనే ఒక దృఢ సంకల్పం. మగ్గాల నుంచి ఆధునిక మరమగ్గాల వరకు ఏ మిషనరీని ఉపయోగించినా నేతన్న చేయి లేకుంటే వస్త్రంగా ఆకృతి దాల్చదు. నాటి నుండి విభిన్న పరిణామాల అనంతరం రకరకాల వస్త్రాలుగా రూపుదిద్దుకొని, అద్దకంతో సొబగులు అద్దుకొని మార్కెట్లో ఆవిష్కరించబడుతున్నాయి. ఆ క్రమంలో అనేక సృజనాత్మక మేధస్సుతో కళలు చోటుచేసుకోవడం ఒక గొప్ప విషయం. చేతి రుమాల నుంచి మొదలుకొని పట్టువస్త్రాల వరకు అనేక విభాగాలలో ఒక్కో ఆవిష్కరణలో ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మరమగ్గాలు ఉన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మశాలి వర్గం నేతవృత్తిని నమ్ముకొని పరిశ్రమలతో జీవనోపాధి పొందుతున్నాయి. కష్టపడి పని చేసి చేనేత కార్మికులు కొందరు యజమానుల వరకు ఎదిగారు. ఆ క్రమంలో అనుకూల, ప్రతికూల పరిస్థితుల కారణంతో అనేక మార్పులు సంభవించడం సిరిసిల్ల పరిశ్రమ వర్గాలలో సహజంగా ఉన్నాయి.
ఇతర వృత్తులలో కంటే చేనేత వృత్తిలో కార్మికుడు ఏకధాటిగా గంటల పాటు శ్రమను వెచ్చిస్తేనే గాని ఒక ఆకృతి ముందుకు రాదు. సునిశితమైనటువంటి డిజైన్లు, అనేక సాంకేతిక విభాగాలను మిషనరీల ద్వారా అనుబంధ పరిశ్రమల కూర్పుతో ప్రత్యేకమైనది. స్పెండల్ మిషన్లు, వార్పిండ్లు, డయింగులు, లూమ్స్, ట్విస్టింగ్ మిషన్లు, సైజింగ్‌లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫినిషింగ్ విభాగాలు ఇలా అనేకమైనటువంటివి వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తికి ప్రత్యేక మూలాలు. ఒక్కొక్క విభాగంలో పలు రకాల నైపుణ్యత కలిగిన కార్మికుల శ్రమ ప్రత్యేకంగా ఉంటుంది. చేనేతలు ప్రత్యేక అనుభవంతో కూడిన చేనేత కార్మికుని సృజనాత్మక ప్రత్యేకత. కాలక్రమేణా సాంకేతిక మిషనరీ విభాగాలలో ప్రత్యేకతలు ఎన్ని వచ్చినప్పటికీ చేనేత వస్త్ర ఉత్పత్తిలో నిబద్ధతతో కూడిన కార్మికశక్తి ఎక్కువ శాతంగా కేంద్రీకృతమైంది. సిరిసిల్ల ప్రాంతంలో తయారైన వస్త్రాలు దేశం నలుమూలల్లోకి వెళ్లి బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల పోటీకి సరసన నిలిచి ‘అగ్గిపెట్టలో చీర’ను సృష్టించిన ఘన చరిత్ర సిరిసిల్లకే దక్కింది.
యజమాని నుండి కార్మికుని వరకు మధ్యలో కలిగిన అనేక విభాగాలలో వ్యవస్థ సమ్మేళితంగా మనుగడ సాగుతున్న క్రమంలో.. కార్మికులు, ఆసాములు, యజమానులు మూడు దశల్లో పరిశ్రమ విరాజిల్లుతుంది. మొదటగా కొన్ని ఏళ్ల శ్రమతో కార్మికుడిగా మొదలై ఆసాములుగా, యజమానులుగా ఎదిగిన వారు ఉన్నారు. కుటీర పరిశ్రమలోని అనేక మూలాలలో వారి మధ్య అనుబంధం కనిపిస్తుంది. నేతవృత్తిని నమ్ముకున్న కుటుంబాలలో ఇంటిల్లిపాది శ్రమించి వస్త్రోత్పత్తిలో భాగమవడం సిరిసిల్ల నేత పరిశ్రమలో ఒక ప్రత్యేకం. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సిరిసిల్ల నేత వర్గంలో అనేక ఏళ్లుగా ఉత్పత్తిలో మాంద్యంను అనేక సార్లు ఎదుర్కొన్నారు. అయినా వాళ్లు నమ్ముకున్న వృత్తిని వీడలేదు. చేనేత బతుకు జీవన పోరాటంలో నిత్యం ఒక ఆవిష్కరణ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది.
ఆనాడు చేనేత మగ్గం ద్వారా ఉత్పత్తి గావించి అనేక అద్భుతాలు సృష్టించారు. నేడు ఆధునిక రేపర్ లూమ్స్‌పై కూడా వారి మార్కును చాటుకున్నారు. కాలక్రమేణా అనేక కొత్త ఉత్పత్తి యంత్రాలు రూపుదాల్చుకున్ననూ మార్కెట్ ఎగుడు దిగుడు పరిస్థితులను ఎదుర్కోవడం వారికి తప్పలేదు. అందుకు ప్రత్యేక కారణంగా ఒకసారి పరిశీలిస్తే దేశంలో బొంబై, సూరత్, సోలాపూర్, అహ్మదాబాద్, గుజరాత్, భీవండిలలో వస్త్ర ఉత్పత్తి కేంద్రీకృతమైన విషయం అందరికీ తెలిసిందే. సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తి పరిశ్రమతో దేశంలో ప్రసిద్ధి చెందిన వస్త్ర ఉత్పత్తి కేంద్రాలను పోల్చి చూస్తే అనేక వ్యాపార ఉత్పత్తి విభాగాలు భిన్నంగా ఉంటాయి. అందుకు ప్రత్యేక కారణంగా చెప్పాలంటే సిరిసిల్లకు రవాణా సదుపాయాలలో రైలు మార్గం లేకపోవడం, పెద్ద మార్కెట్లకు అనుసంధానంగా లేకపోవడం ఇది ఒక వెనుకబాటు అని చెప్పవచ్చు.
ముడిసరుకులు గానీ, తయారైన ఉత్పత్తులు గానీ ఎగుమతి దిగుమతి విషయంలో నేరుగా సంబంధాలు పెద్ద మార్కెట్లతో లేకపోవడం జరుగుతుంది. తయారైన వస్త్రాన్ని ఇతర రాష్ట్రాల మార్కెట్లలోకి నేరుగా గతంలో ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కకపోవడం గమనార్హం. సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్క్, అపెరల్ పార్కు కలవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌పిఎం, చీరల తయారీ, మ్యాక్స్ సొసైటీలు, నూలు డిపో ఇలా సిరిసిల్ల నేత వర్గాలకు ఇచ్చి ఊరట కలిగించాయి. మరిన్ని పథకాలను కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను కూడా సిరిసిల్ల నేత వర్గానికి అందివ్వడం ప్రభుత్వాలు చేస్తున్న కృషికి నిదర్శనం. నైపుణ్యత, కళాత్మకతలతో పాటు వృత్తిపై బాధ్యతతో శ్రమించి పని చేసే తత్వం కలిగిన నేత వర్గానికి ఆదరించే అవకాశాలు, పథకాలు పెద్దపీట వేస్తున్నాయి.
– చిటికెన కిరణ్ కుమార్- 94908 41284