Wednesday, January 22, 2025

65 వేల సీడ్ బాల్స్ తయారీ

- Advertisement -
- Advertisement -

Sircilla Girl Sets Out On Path To Plant A Green Future

సిరిసిల్ల చిన్నారికి అరుదైన ఘనత
బ్లెస్సీకి కెటిఆర్ అభినందనలు
ప్రకృతి పట్ల ప్రేమను కనబర్చే చిన్నారులను ప్రొత్సహించాలి: ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

హైదరాబాద్ : పర్యావరణహితం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట భారీగా చెట్ల పెంపకాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మంచి పనిలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు మొక్కలు నాటుతూ మరికొందరికి మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసురుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు. తాజాగా సామాన్యులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేస్తూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు నాటడమే కాదు సీడ్‌బాల్స్ తయారు చేసి వాటిని అడవుల్లో, రోడ్ల పక్కన వెదజల్లడం ద్వారా మొక్కల పెంపకాన్ని చేపట్టే కార్యక్రమానికి ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ శీకారం చుట్టారు.

అయితే ఈ సీడ్ బాల్స్ కాన్సెప్ట్ సిరిసిల్ల జిల్లా సుద్దాలకు చెందిన ప్రకృతి ప్రకాష్ కుమార్తె బ్లెస్సీకి బాగా నచ్చినట్లుంది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో వెంటనే సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించింది. ఇలా ఇప్పటివరకు ఈ బాలిక 65 వేల సీడ్ బాల్స్ తయారు చేసి అరుదైన రికార్డ్ సాధించింది. ఇలా తయారు చేసిన సీడ్‌బాల్స్‌ను సిరిసిల్ల అటవీ ప్రాంతంలో వెదజల్లింది బ్లెస్సీ.జ ఇలా పర్యావరణరహిత కార్యక్రమం చేస్తూ ఆదర్శంగా నిలిచిన బ్లెస్సీ గురించి మంత్రి కెటిఆర్, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు తెలిసింది. సోమవారం ఆమె పుట్టినరోజని తెలిసి తన వద్దకు పిలిపించుకున్న మంత్రి కెటిఆర్ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి బాలికను మరోసారి అభినందించారు. అంతకుముందు తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన బ్లెస్సీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసీ పార్కులో బాలికతో ప్రత్యేకంగా ఓ మొక్కను ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ నాటించారు. అనంతరం తాను తయారు చేసిన సీడ్ బాల్స్‌ను బాలిక ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు బహుకరించింది. అక్కడి నుండి బ్లెస్సీతో పాటు తల్లిదండ్రులు, సోదరుడిని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ తన వెంట తీసుకుని కెటిఆర్ వద్దకు తీసుకెళ్లారు.

చిన్నతనంలోనే బ్లెస్సీ ప్రకృతిపై ఇంత ప్రేమ పెంచుకోవడానికి కారణం తల్లిదండ్రులేనని తెలుసుకున్న కెటిఆర్ దంపతులు ప్రకాష్, మమతను అభినందించారు. ఇలాగే ప్రకృతిహిత కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని.. ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని బ్లెస్సీతో పాటు ఆమె కుటుంబానికి కెటిఆర్ భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకృతి, పచ్చదనాన్ని కాపాడేందుకు హరితహారం.. దీని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మొదలయ్యిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలే ఇప్పుడు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని.. ఇందుకోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఇక ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పిల్లల్లో కూడా చైతన్యం నింపడం పట్ల ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన మరింత పెరగాలంటే, ప్రకృతి పట్ల ప్రేమను కనబరిచే చిన్నారులను ప్రోత్సహించాలి అని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ స్ఫూర్తితోనే తమ బిడ్డతో సీడ్ బాల్స్ తయారు చేయించామని బ్లెస్సీ తండ్రి ప్రకాష్ తెలిపారు. తమ కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌కు ఆహ్వానించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనటం గొప్ప వరంగా భావిస్తున్నామని ప్రకాష్ తెలిపారు.

Sircilla Girl Sets Out On Path To Plant A Green Future

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News