పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామ పంచాయతీలో జరిగిన శిరీష హత్య కేసులో పరిగి పోలీస్‌లు దర్యాప్తు వేగవంతం చేశారు. శిరీషది హత్యనా? ఆత్మహత్యనా.. అత్యాచారామా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దీంతో సోమవారం కాళ్లాపూర్ గ్రామంలోని శిరీష ఇంటికి వెళ్లిన ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, డిఎస్పి కరుణ సాగర్‌రెడ్డిలు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వైష్ణవితో రీ పోస్ట్‌మార్టం చేయించారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న బంధువులు, గ్రామస్థులు శిరీష హత్య కేసులో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ముమ్మాటికి హత్యేనని శిరీష బావ అనిలే హత్య చేశాడని పోలీస్‌లను నిలదీశారు. అంతేకాకుండా శిరీష తండ్రిపై కూడా స్థానికులు దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని సముదాయించారు.
అనంతరం శిరీష మృతదేహానికి మధ్యాహ్న సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పరిగి డిఎస్పీ కరుణసాగర్‌రెడ్డి మాట్లాడుతూ హత్యనా ఆత్మహత్యనా అనే విషయం ఇప్పుడే తేల్చలేమని రీ పోస్ట్‌మార్టం రిపోర్టు పూర్తిస్థాయిలో వస్తేనే తెలుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆదివారం మృతురాలి బావ అనిల్‌ను మొదట నిందితునిగా భావించి అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ఆ తరువాత వదిలేశారు. అయితే అనిల్ ఫోన్ తీసుకుని డాటా సేకరించడంతోపాటు అనిల్ తన మొబైల్‌లో శిరీష నెంబర్ డార్లింగ్ అని సేవ్ చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో అనిల్ మాత్రం తాను శిరీషను హత్య చేయలేదని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా శిరీష తండ్రిని, మొబైల్ డేటా ఆధారంగా మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
మండలంలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష హత్యకు గురికావడంతో సోమవారం ఉదయం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం అంత్యక్రియలకు రూ. 5వేల ఆర్థిక సహాయం అందించారు. హత్య చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని శిక్షించాలని పోలీస్‌లను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచ్ జంగయ్య, ఎంపిపి అరవింద్‌రావు, జంగయ్య గ్రామస్థులు తదితరులు ఉన్నారు.