సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటి జయంతి సందర్భంగా ఆయన రచించిన ప్రతి అక్షరాన్ని ముద్రించి పుస్తక రూపంలో అభిమానులకు అందించాలనే బృహత్ యజ్ఞం తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా.తోటకూర ప్రసాద్ సంకల్పించి తానా, సిరివెన్నెల కుటుంబం సహకారంతో సాకారం చేశారు. సినిమా సాహిత్యం నాలుగు సంపుటాలుగా, సినీయేతర సాహిత్యం మరో రెండు సంపుటాలుగా రానున్నాయి. సిరివెన్నెల జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ’సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం సంపుటి-’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
గరికపాటి నరసింహారావు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్, మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో సీతారామశాస్త్రి అగ్రగణ్యులు. సినిమా పాటలలో విలువలని రాసులుగా పోశారాయన. సిరివెన్నెలను సినిమా పాటల రచయితగానే చూడలేం. నా అభిప్రాయం ప్రకారం ఆయనొక నిశ్శబ్ద పాటల విప్లవం. నవ్య వాగ్గేయకారుడు”అని అన్నారు.