ఏళ్ల కొద్ది ఒకే పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు
కొత్తవారికి దక్కని అవకాశాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిస్థితి
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కొందరు ఎస్సైలు ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏళ్లకొద్ది పనిచేస్తున్నారు. ఎస్సైలు బదిలీ కావాల్సిన సమయం ఆసన్నమైనా ఇప్పటి వరకు అక్కడి నుంచి కదలడంలేదు. ఒక వేళా బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు యత్నించిన తమదైన శైలిలో పైరవీలు చేసి అక్కడే ఉంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఎస్సైలు తిష్ట వేశారు. వీరు కొత్తగా వచ్చిన వారిని వేధింపులకు గురిచేయడమే కాకుండా అక్కడి నుంచి బదిలీ చేసుకునేలా చేస్తున్నారు. ఇటీవలే ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై బదిలీ అయినా కూడా వెళ్లకుండా అక్కడే ఉండడంతో గత పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేశారు. గతంలో కూడా ఇలాగే పలువురు ఎస్సైలను బదిలీ చేసినా కూడా రిలీవ్ కాకుండా అక్కడే ఉండిపోయారు. కొత్తగా బదిలీ అయిన పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేస్తే తమకు ఆదాయం తగ్గిపోతుందని బదిలీ ఉత్తర్వులు వచ్చినా వెళ్లకుండా ఉంటున్నారు. ఇది గమనించిన గత పోలీస్ కమిషనర్ వారిని అందరిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేశారు. ఎస్సైలు ఏళ్ల కొద్ది తిష్ట వేయడంతో కొత్త వారికి అవకాశాలు రాకుండా పోతున్నాయి.
ఆ పోలీస్ స్టేషన్‌లో ఆయనదే హవా…
మాదాపూర్ డివిజన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ర్యాంకర్ ఎస్సై చెప్పిందే వేధం. మొత్తం స్టేషన్‌ను తన కంట్రోల్‌లో పెట్టుకుని ఏకంగా ఎస్‌హెచ్‌ఓ కూడా తను చెప్పినట్లు వినేలా చేసుకున్నాడు. దీంతో అతడి పేరు చెబితే చాలు ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది భయపడుతున్నారు. ఇన్స్‌స్పెక్టర్ ఆయన చెప్పినట్లు వింటున్నాడని, తమకు ఎందుకు రిస్కు అని భావిస్తున్నారు. ఇటీవల వివాదాస్పదమైన ఓ షుటింగ్ పర్మిషన్ విషయంలో ఆ ర్యాంకర్ ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ తీయాలంటే సైబరాబాద్ పోలీస్ కమిషరేట్‌లో దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తారు. ఇది ఏది లేకుండానే సదరు ఎస్సై రోజుకు రూ.30,000 తీసుకుని షూటింగ్ చేసుకోండని అనుమతి ఇచ్నిట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వివాదస్పదంగా మారింది, ఎలాంటి అనుమతి లేకుండా షూటింగ్ చేయడంతో స్థానిక మీడియా వారు నిలదీశారు. తన అనుమతి ఉంటే చాలు ఏదైనా చేయవచ్చని వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.