న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పందించింది. తన భార్య ఆరోగ్యం బాగాలేదని తీవ్ర సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స దశలో తాను వెంట ఉండాల్సి వస్తోందని తనకు తాత్కాలికంగా జైలు నుంచి విముక్తి కల్పించాలని సిసోడియా అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ స్పందిస్తూ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటి యధాతథ స్థితి గురించి తమకు గురువారం (నేడే) నివేదించాలని సిబిఐ తరఫు న్యాయవాదికి తెలిపింది. సిసోడియా బెయిల్ దరఖాస్తుపై సిబిఐ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించారు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే ఇది సాధ్యం కాకపోవచ్చునని లాయర్ వివరణ ఇచ్చుకున్నారు.
కాదని స్పష్టంగా చెప్పడం కాదని, రిపోర్టు గురువారం అందించేందుకు ముందుగా సాధ్యమైనంత వరకూ యత్నించాలని, దీనిని బట్టి ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపే అవకాశం పరిశీలిస్తామని న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ స్పష్టం చేశారు. సిసోడియా అవసరం ఆయన ఇంట్లో ఎంతైనా ఉందని, భార్య చికిత్సకు ఆయన వెంట ఉండాల్సి వస్తోందని సిసోడియా తరఫు లాయర్లు తెలియచేసుకున్నారు. సిసోడియా భార్య ఆరోగ్యం తీవ్రస్థాయిలో విషమిస్తోందని వెంటనే బెయిల్‌పై పరిశీలన అవసరం అని కౌన్సెల్ తెలిపింది. ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్టు జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఆయనపై ఇడి నుంచి సిబిఐ నుంచి ఏకకాలపు విచారణలు జరుగుతున్నాయి. రెండు మూడు సార్లు ఆయన బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది.