అమరావతి: ప్రేమించిన బావతో పెళ్లి జరగకపోవడంతో అక్క తన బాధను చెల్లికి చెప్పుకుంది. అక్క బాధపడడంతో ఆమెతో కలిసి చెల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా సాలూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సేబి సోంబారమ్మ(24), పోయి లక్ష్మి(19) ఇద్దరు అక్కాచెల్లెళ్ల కూతుర్లు. సోంబారమ్మ తన మేనమామ కుమారుడిని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల సభ్యుల నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరగడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.
సోంబారమ్మ తన మనసులో ఉన్న బాధను చెల్లెలు లక్ష్మికి చెప్పి పలుమార్లు కన్నీంటి పర్యంతమైంది. దీంతో అక్క బాదను తట్టుకోలేక ఇద్దరు కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కచెల్లెలు కనిపించకపోవడంతో గ్రామంలో కుటుంబ సభ్యులు వెతికారు. గ్రామ శివారులో వారి మృతదేహాలను కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ రామ కృష్ణ, ఎస్‌ఐ నారాయణరావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.