Friday, November 22, 2024

సావిత్రి బాయి పూలే ఆదర్శంగా.. ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తోన్న అక్కాచెల్లెళ్లు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ : బాలికలు, మహిళలు అక్షరాస్యులుగా మారితేనే వారి జీవితాల్లో వెలుగులు నిండడంతో పాటు ఇతరుల జీవితాలకు దారి చూపుతారనే ఉద్దేశంతో బాలిక విద్యకు ఎనలేని కృషి చేసి భారత దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే. ఆమెను ఆదర్శంగా తీసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ, నేటితరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మకుంటకు చెందిన విశ్రాంత పిఈటి బి.గోపాలంకు మొత్తం నలుగురు కుమార్తెలు. వీరిలో ఏకంగా ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయినిలుగా మారి బాలికలను విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తమదైన శైలిలో తర్ఫీదును ఇస్తున్నారు. తమ చిన్నతనం నుంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా విశేష సేవలను అందిస్తున్న తండ్రిని చూస్తూ పెరిగిన ఆయన కుమార్తెలు బి.రూప, బి.దీప, బి.పుష్పలు ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయినిలుగా తమ సేవలను అందిస్తున్నారు.

మక్తల్ మండలం కర్ని జడ్పిహెచ్‌ఎస్‌లో పిఈటిగా విధులు నిర్వహిస్తున్న బి.రూప గత పన్నెండేళ్లుగా అనేక మంది బాలికలకు క్రీడల్లో శిక్షణను అందిస్తున్నారు. ఆమె శిక్షణలో దాదాపు 50మంది బాలికలు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని పలుమార్లు విజేతలుగా నిలిచారు. అలాగే మాగనూరు మండల కేంద్రంలో ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్న బి.దీప బాలికలను చదువులో మెరికలుగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కొన పాలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఈటిగా విధులు నిర్వహిస్తున్న బి.పుష్ప 2019నుంచి ఇప్పటి వరకు అనేక మందిని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే విధంగా శిక్షణను అందిస్తున్నారు. పాఠశాలలోనే కాకుండా క్రీడా శాఖ ద్వారా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ బాలికలను క్రీడల్లో ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఆదర్శంగా తీసుకున్న వారి శిష్యులు దాదాపు వందమంది వరకు ప్రస్తుతం వ్యాయామ విద్యను అభ్యసిస్తూ, భవిష్యత్తులో పిఈటిలుగా రాణించేందుకు శ్రమిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News