మనతెలంగాణ, హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టైన నిందితులను శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ వేయగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. దీంతో ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్, రేణుక రాథోడ్, డాక్య, కేతావత్ రాజేశ్వర్, కేతావత్ నీలేష్ నాయక్, పత్లావత్ గోపాల్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ రాజేంద్రన నాయక్‌ను చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. మిగతా వారిని అక్కడే ఉంచి ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిని సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయానికి శనివారం తీసుకుని వచ్చారు. విచారణలో భాగంగా నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సిట్ అధికారులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను నేరం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా టిఎస్‌పిఎస్‌సిలోని కాన్ఫిడెన్షియల్ రూంలోకి ఇద్దరిని తీసుకుని వెళ్లి అధికారులు విచారించారు. సెక్షన్ అధికారి శంకర్‌లక్ష్మికంప్యూటర్‌ను ఇద్దరు నిందితుల సమక్షంలో పరిశీలించారు. ఆ కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ కావడంతో అక్కడే వారిని విచారించారు. ఎలా కంప్యూటర్‌ను ఓపెన్ చేశారు, ఐపి అడ్రస్‌లు మార్చేసి, కంప్యూటర్‌లోకి ఎలా చొరబడ్డారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. శంకర్‌లక్ష్మి, ప్రవీణ్, రాజశేఖర్ సంబంధాలపై ఆరా తీశారు. శంకర్‌లక్ష్మి పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసి తెలుసుకున్నారా లేక ఆమె డైరీలో ఎక్కడైనా రాసింది తెలుసుకున్నారా అనే విషయంపై ఆరా తీశారు. ఇద్దరితో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత వారిని హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకుని వెళ్లారు. నిందితులను అందరినీ ఒకే వద్ద కూర్చొబెట్టి పోలీసులు విచారణ చేయనున్నట్లు తెలిసింది.
ప్రశ్నపత్రాలు కొన్న వారి గురించి ఆరా…
సిట్ అధికారులు నిందితుల నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాల ప్రశ్నపత్రాలు లీక్ చేశారు, ఎవరెవరికి విక్రయించారు, వారి వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన వారి వివరాలు తెలుసుకుని వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాలను ఎంతకు విక్రయించారు, వచ్చిన డబ్బులను ఎవరెవరు తీసుకున్నారనే దానిపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. వచ్చిన డబ్బులను నిందితులు ఎక్కడ దాచిపెట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఒక వేళా బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తే వాటిని సీజ్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.