చండీగఢ్: హాస్టల్ విద్యార్థినులు ఉమ్మడిగా ఉపయోగించే బాత్‌రూమ్‌లో అభ్యంతరకరమైన వీడియోలను చిత్రీకరించారంటూ చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు చేసిన ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పంజాబ్ పోలీసు శాఖ సోమవారం ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ అధికారి గురుప్రీత్ కౌర్ దేవ్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సిట్ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తుందని, దోషులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని పంజాబ్ పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ సోమవారం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోందని ఆయన చెప్పారు. విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేశారని ఆరోపిస్తూ మొహాలీలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థునులు శనివారం రాత్రి నిరసనలు చేపట్టారు. ఒక విద్యార్థిని రికార్డు చేసిన ఈ వీడియోలను అప్‌లోడ్ కూడా చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారు. తమ పట్ల హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వారు ఆరోపణలు చేశారు.
కాగా.. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు. కాగా..ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తన 23 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌కు తన వీడియోను మాత్రమే పంపించిందని, ఇతర విద్యార్థుల అభ్యంతరకర వీడియోలు ఏవీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థినిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేయగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 31 ఏళ్ల మరో వ్యక్తిని కూడా హిమాచల్ ప్రదేశ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఈ ముగ్గురు నిందితులను మొహాలీలోని ఖరార్‌లో కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆ విద్యార్థిని సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ అనాలిసిస్ కోసం పంపించారు.
SIT Probe on Chandigarh University Students Issue