హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సిఎం అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం టిపిసిసి చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సభలో టిపిసిసి చీఫ్ రేవంత్‌ను నిర్వాహకులు సన్మానించారు. దీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చాలా ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు ఎపి రాజకీయాలపై ఆయన స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. దళితులు, ఆదివాసీలకు సిఎం అయ్యే అవకాశం లేదా అని రేవంత్‌ను కొందరు ప్రశ్నించగా, దీనికి రేవంత్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అయ్యింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సిఎం అభ్యర్థిని ప్రకటించడం మా పార్టీ సంప్రదాయం కాదన్నారు. అవసరమైతే పార్టీ సీతక్కను కూడా ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రజల కోసం ఏదైనా చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని రేవంత్ కోరారు. తన పట్ల కాంగ్రెస్ భిన్నంగా వ్యవహారించవద్దని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అంటే రేవంత్ అని, రేవంత్ అంటే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకురావడానికి తాను నిత్యం శ్రమిస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ సహాయ, సహకారాన్ని అందించాలని ఆయన సూచించారు.
అమరావతి, పోలవరంను మేమే నిర్మిస్తాం
దీంతోపాటు అమరావతి, పోలవరంపై రేవంత్ మాట్లాడారు. అమరావతి, పోలవరంను మేమే నిర్మిస్తామని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎపిలో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారని అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని రేవంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ వంటి తెలుగు ప్రముఖులు ఉన్నప్పుడు అక్కడ మనవాళ్లు ఉన్నారన్న నమ్మకం ఉండేదని, ప్రస్తుతం ఢిల్లీలో తెలుగు వారికి అవకాశం లేకుండాపోయిందన్నారు. ఎపి అమరావతి ప్రస్తావనతో పాటు సభలో రేవంత్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఎన్‌ఆర్‌ఐల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎన్టీఆర్ ఏకలవ్యకు చాలా మంది శిష్యులు ఉన్నారని, ఇప్పుడు అన్ని పార్టీల్లో ఆయన అభిమానులు ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్‌దని రేవంత్ కొనియాడారు. తానా సమావేశాలకు ఎమ్మెల్యే సీతక్క హాజరుకాగా, సీతక్కను సిఎం చేస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ చర్చకు కారణం తీశాయి.