Sunday, December 22, 2024

మేనల్లుడు ఏచూరి స్మరణలో..

- Advertisement -
- Advertisement -

అది 1952 ఆగస్టు 12వ తేదీ, చెన్నైలోని ఓ నర్సింగ్ హోం వెలుపల కారులో కూర్చుని ఉన్నాను. ఎదురు చూస్తున్నట్లుగానే శుభవార్త తెలిసింది. నా సోదరి కల్పకం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి నేను ఎంతో సంతోషించా, ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే లోపలికి వెళ్లి మేనల్లుడిని చూసి, తనివితీరా నోరారా పలకరించాలని వెంటనే ముందుకు సాగాను. అయితే ఇక్కడనే ఆచార వ్యవహారాల చిక్కొచ్చిపడి, నా ఆత్రుతకు అడ్డుకట్ట పడింది. శిశువు రోహిణి నక్షత్రంలో అందులోనూ కృష్ణాష్టమి ఘడియల్లో పుట్టాడని తెలిపారు. ఈ రోజునే హిందూ పురాణేతిహాసాల మేరకు చూస్తే అప్పటి యుగంలో శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడిని సంహరించాడనే గాథ ఉంది.

దీనిని పరిగణనలోకి తీసుకుని నేను సంప్రదాయం ప్రకారం వేచిచూడాల్సి వచ్చింది. ముందుగా నవజాత శిశువు ముఖారవిందాన్ని కొబ్బరి నీళ్ల గిన్నెలో చూపించారు. తరువాతనే నేను పసికందును చూశాను. స్పృశించాను. ఇది అప్పటి నా అనుభవం. ఇప్పటికీ సదా స్మరణీయం. పుట్టిన బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడంలో నా సోదరికి, నా తల్లికి సాయం చేస్తూ వచ్చాను. ఓ విధంగా చూస్తే బాబును నా చిన్నతమ్ముడిగా భావించాను. ఓసారి ఏమి జరిగిందంటే ఎత్తుకుని తిరుగుతూ ఉంటే ఈ బాబు అనుకోకుండా కింద రాతిపై పడ్డాడు. అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు. దెబ్బలు తగలలేదు. మెదడకు సంబంధించి కూడా క్లిష్టత ఏర్పడలేదు. బాబు కు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి అంతవరకూ కవలలుగా ఉంటూ వచ్చిన మేమిద్దరమూ విడిపోవల్సి వచ్చింది. నా తల్లి వాడిని ఆప్యాయంగా చూసుకోవడం చూసి అప్పుడప్పుడు ఈర్ష కలిగేది. పైగా సీతారాం చిన్ననాట నా తల్లిని అమ్మా అంటూ పిలవడం, అమ్మమ్మ అనకపోవడం ఇవన్నీ గుర్తుకు వస్తుంటాయి.

తెలుగు సాంప్రదాయం ప్రకారం బాబుకు మా తాత పేరు పెట్టారు. నా తల్లిదండ్రులకు వాడంటే ప్రాణంఅయింది. ఎప్పుడూ బాబు అంటూ ముద్దు చేసేవారు. అమాయకంగా అందంగా ఉండేవాడు. కొన్నిసార్లు వాడు ఏదైనా తప్పిదారి తప్పు చేస్తే నేను అందుకు తిట్లు, తన్నులు తినాల్సి వచ్చేది. అంతా బాబు అని పిలిచేవారు. వాడు పెరిగి పెద్ద అయ్యి, యువకుడిగా, అందగాడుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. మనసుకు తగ్గట్లుగానే సున్నిత మాటల వ్యక్తి టెన్నిస్‌లో ఆరితేరాడు. ఓ దశలో టెన్నిస్ ప్లేయర్ అయిపోతాడా? అన్పించేది. ఇదే క్రమంలో చదువులో తిరుగుండే రకం కాదు. స్కూలు, కాలేజీ విద్యలోనే శభాష్ అన్పించుకుంటూ వచ్చాడు.ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థిగా చేరి ఆ తరువాత రాజకీయ రంగానికి అక్కడి నుంచే నాంది పలికాడు. ఇప్పటికీ అక్కడి ఆయన సమకాలీనులు జెఎన్‌యు ఏచూరి సీతారాంను నేను కన్పించినప్పుడు గుర్తు చేసుకుంటారు. అందరి పట్ల ఆదరణ ప్రేమతో ఉండేవాడని చెపుతూ ఉంటారు.

దేశంలో 1975లో అత్యవసర పరిస్థితి దశలో సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. పోలీసులు అరెస్టు చేసేందుకు గాలింపులకు దిగారు. దీనితో ఆయన నాతో కర్నూలు లో ఉండటం మంచిదని నా తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్లో నేను కర్నూల్‌లో ఉద్యోగంలో చేరాను. పెద్దలు చెప్పిన దానిలోని మంచిని గ్రహించి సీతారాంకు నచ్చచెప్పడానికి యత్నించాను. రాజకీయాలు, ఉద్యమాలు ఎందుకురా అని చెపుతూ వచ్చాను, అయితే ఎంత చెప్పినా వాడు వినలేదు సరికదా, ఓ దశలో నేను వాడి ప్రబోధాలకు లోనయి నేనే కమ్యూనిస్టు అయ్యే పరిణామం నుంచి తప్పించుకోగలిగాను. సర్వీసు నుంచి విరమణ తరువాత గత పది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటూ వస్తున్నాను.

ఇక్కడికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండేవాడు. ఇక్కడికి వచ్చి ఉండే రెండు మూడు రోజులు కొంచెం తీరిగ్గా గడిపేందుకు, కొద్దిలో కొద్దిగా రాజకీయ బాదరబందీ లేకుండా ఉండేందుకు వీలు దక్కేదని నేను ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. కొద్ది సంవత్సరాల క్రితం వాడి కుమారుడు చనిపోవడం విషాదకరం అయింది. అయితే ఈ బాధ తట్టుకుని ముందుకు సాగే నింపాదిని పొందేందుకు ధైర్యం సంతరించుకుని తిరిగి తన లక్షం కోసం ముందుకు సాగాడు. దేశ సమగ్ర ప్రగతి దిశలో అంకితభావాన్ని సంతరించుకున్న లక్షణం సొంతం చేసుకుని ఆద్యంతం ఈ విశ్వాసంతోనే ముందుకు వెళ్లాడు. కుమారుడుగా, మనవడుగా, భర్తగా, తండ్రిగా, తాతగా ఆత్మీయతతో ఎంతగానో వ్యవహరించాడు. ఇక నేతగా పైగా కీలకమైన పార్టీ సారథ్య బాధ్యతలలో ఉంటూ కూడా కార్యదక్షతను చాటుకున్నాడు. దేశమంతా కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. ఇతర దేశాల్లోనూ మెప్పు పొందారు. హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో ఇప్పటివరకూ వస్తున్న లెఫ్ట్ హాండ్ డ్రైవ్ కాలమ్‌లో ఈ వ్యాస పరంపర ఇక సెలవు తీసుకుంటుందని ఇప్పుడిప్పుడే తెలిసివస్తూ ఉంది.

ఇక ఆయన గంభీర గొంతుక మొక్కవోని ధైర్యం, మాటకు చేతకు మధ్య అంకితభావం ఇవన్నీ ఇప్పుడు నిశ్శబ్దం సంతరించుకోవడం బాధాకరం అన్పిస్తుంది. సీతారాంను ప్రశంసించే గౌరవించే లక్షలాది మందిలో నేను కూడా ఒక్కడినే. ఆయన కన్నుమూత తరువాత నా వాట్సాప్, సామాజిక మాధ్యమాలకు వెల్లువెత్తుతున్న సహానుభూతి, సంతాపాలు, విషాదాలు ఇక్కడివి అక్కడివి అని కాదు, దేశవ్యాప్తం అయి ఉంటున్నాయి. ఖండాంతరాల నుంచి కూడా ఇదే వరుసలో సందేశాలు అందుతున్నాయి. ఈ వెల్లువచాలు ఆయన పట్ల అన్నింటికీ అతీతంగా నెలకొని ఉన్న అభిమానం ఎంతటి సమున్నతం అనేది తెలిసి వస్తుంది. సీతారాం పట్ల ఎంతటి గౌరవనీయ భావం ఏమిటనేది గ్రహించడం ఇప్పుడు నా వంతు అయింది. అభిమానం ఎంతటి అపారం అవుతుందనేది ఆయన తరువాత ఇప్పుడు నలుదిక్కుల నుంచి మనసును తాకుతున్న స్పందనలతోనే విదితం అవుతోంది. ఈక్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.

మోహన్ కందా
(సీనియర్ ఐఎఎస్, రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News