Monday, December 23, 2024

యాపిల్ అలర్ట్ మెసేజ్‌పై సీతారాం ఏచూరి ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తన ఐఫోన్‌లో యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చిందని, ఇది కేవలం మోడీ ప్రభుత్వ అజమాయిషీలో సాగే నిఘా దాడి అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మంగళవారం ధ్వజమెత్తారు. వార్తా సంస్థ పీటీఐ తో ఆయన మాట్లాడుతూ ఇది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులపై దాడియే కాక, ప్రజాస్వామ్య విధ్వంసంలో ఒక భాగమని ఆరోపించారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు కూడా పునరుద్ధాటించిందని ఆయన ఉదహరించారు. ఈ విధమైన హ్యాకింగ్, నిజానికి మోడీ ప్రభుత్వం కల్పించిన నిఘా వ్యవస్థగా ఆయన ఆరోపించారు. “ నా మట్టుకు దాచి ఉంచడానికి ఏమీ లేదు. ప్రతివారికి నా స్థితి తెలుసు.

నా మెయిల్‌ను హ్యాకింగ్ చేయడం వల్ల వారు ఏం కనుగొంటారో తెలీదు. దీనివల్ల బహుశా భారత చరిత్రను వారు అర్థం చేసుకోవచ్చు. లేదా మెరుగైన ఇంగ్లీష్‌ను నేర్చుకోవచ్చు. ” అని ఆయన వ్యాఖ్యానించారు. “ పెద్దగా ఆందోళన కలిగించే విషయమేమంటే… ఈ సాధనం రిమోట్ ద్వారా నియంత్రించడమే కాక, అందులో వారు తమకు తోచిన సమాచారాన్ని జొప్పించవచ్చు. ” అని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.

“యాపిల్ వార్నింగ్ కూడా నా సిస్టమ్‌ను రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చని వెల్లడించింది. నన్ను నేరస్థుణ్ణి చేయడానికి వారు ఏదైనా సమాచారాన్ని జొప్పించవచ్చు . దాని ఆధారంగా ఏదైనా చర్య తీసుకోడానికి పాల్పడవచ్చు. ” అని యేచూరి పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న ప్రస్తుత మోడీ ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడబోదని చెప్పలేం. అని యేచూరి ఆరోపించారు. ‘ఈ విధానం పూర్తిగా ఆమోదయోగ్యం కానిది. ప్రధానిగా రాజ్యాంగం పై ప్రమాణం చేసిన మోడీ దీనిపై స్పష్టత ఇవ్వాలి’ అని యేచూరి గట్టిగా నిలదీశారు.

యాపిల్ సంస్థ వివరణ
ఈ వివాదంపై ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ స్పందించింది. అలాంటి హ్యాకింగ్ ప్రయత్నం ఏమీ జరగలేదని తెలిపింది. ఇలాంటి నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ అలర్ట్‌లు కూడా కావొచ్చని పేర్కొంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. “ ఈ అలర్ట్ నోటిఫికేషన్లను నిర్దిష్టంగా అధికారికంగా పనిచేసే హ్యాకర్ల పనిగా ఆపాదించలేం. హ్యాకింగ్ చేసేందుకు వారు అధునాతన పద్ధతులను అవలంబిస్తారు. దీనికి అవసరమైన నిధులు, టెక్నాలజీ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

వారి హ్యాకింగ్ దాడులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఇలాంటి దాడులను గుర్తించడమనేది నిఘా సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. యాపిల్ ఫోన్లకు వచ్చే అలర్ట్ నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు కూడా కావచ్చు. లేదా కొన్ని దాడులను గుర్తించలేం కూడా” అని యాపిల్ తమ ప్రకటనలో వెల్లడించింది. అయితే విపక్ష ఎంపీలకు ఈ హ్యాక్ అలర్ట్ మెసేజ్‌లు మంగళవారం ఎందుకు వచ్చాయన్నది చెప్పడానికి యాపిల్ నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News