మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మణుగూర్: ఉ మ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరప్రదాయని అయిన సీతారామసాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది . దశాబ్దాల సాగు నీటి కల సీతారామ ప్రాజెక్ట్ తో నెరవేరబోతుంది. ట్ర యిల్ రన్‌తోఎగిసిపడ్డ గంగమ్మ జల సవ్వడులతో ఉమ్మడి ఖమ్మం నేల తడిసి ముద్దయ్యింది. ఉమ్మడి జిల్లాతోపాటు మహబుబ్ బాద్ జిల్లాలోని మొత్తం పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తికావోస్తుంది.కొన్ని దశబ్దాల రైతాంగం కల నెరవేరుతున్న వేళ బుధవారం ఆర్ధరాత్రి దాటిన తరువాత నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పులకరించిపోయారు. గోదావరి గంగమ్మ ఎగిసిపడటంతో మంత్రి తు మ్మల ఆనందంతో తన్మయం పొందారు. నెత్తిన గో దావరి జలాలను చల్లుకొని ఆనందంలో భూమాత కు నమస్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గో దావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయంగా,
తన జీవిత ఆశయంగా పెట్టుకున్న తుమ్మల ఆశయం నెరవేరుతున్న వేళ ఆయన ఆనందంతో తడిసి ముద్దయ్యారు. గత ఇరవై రోజులుగా ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేసిన అధికారులు చివరికి సక్సెస్ అయ్యారు.ఈ ప్రాజెక్టు ని వచ్చే ఆగస్టు 15 నాటికి సాగర్ లింక్ కెనాల్ కు అనుసంధానించి సాగర్ కాలువల్లో గోదావరి జలాలు పారించేందుకు సర్వం సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీ.జీ. కొత్తూరు గ్రామం వద్ద ఉన్న మొదటి లిఫ్టు కు ఆర్ధరాత్రి దాటిన తరువాత ఇరిగేషన్ అధికారులు ట్రైల్ రన్ ప్రారంభించారు. మోటార్‌కు నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటా రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. గురువారం ఉదయం ట్రయల్ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పరిశీలించారు.
గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతుండటంతో మంత్రి ఒక్కసారిగా పరవశించిపోయారు. త్వరగా పనులు పూర్తి చేసి జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటిని అందించాలంటూ అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వడమే తన చివరి కోరిక, తన రాజకీయ లక్ష్యమని ఆయన అన్నారు . ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన రైతులందరికి ఆయన పాదాభివందనాలు తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రేయింబవళ్ళు కష్టపడ్డ అధికారులను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సు తో ఇచ్చిన నిధులతో వేగంగా పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు .బీ.జీ కొత్తూరు, పూసుగూడెంకమలాపురం మూడు పంప్ హౌస్ ల్లో మొదటి లిఫ్ట్ ట్రైల్ రన్ ….. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో సక్సెస్ అయిందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పది లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటితో స్థిరీకరణ చేస్తామన్నారు.
ఈ వర్షాకాలంలోనే లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల చెప్పారు . ఈ పంప్ హౌస్ ద్వారా 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 4 పంపుల ద్వారా 104 కిలో మీటర్లు నీటి సరఫరాకు ప్రధాన కాలువ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ కాలువకు ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు అనుసంధానం చేయనున్నామని తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1.20 లక్షల ఎకరాలకు మొదటి విడతగా సాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాలలో విడతల వారీగా సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్య శ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్‌లో ఈ ట్రయల్ రన్ కీలక ఘట్టంగా మారింది .ఈ వానాకాలంలోనే వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు పారేలా యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు అనేక అవంతరాలను దాటుకొని ట్రయల్ రన్ వరకు వచ్చింది. ఈ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.