70శాతానికి పనులు పూర్తి
70 గోదావరి జలాల వినియోగం
6.74లక్షల ఎకరాలకు సాగునీరు
2024 పథకం ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది ఆధారంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. నీళ్లు, నిధులు,నియామకాలు నినాదంతో ప్రజలను ఉద్యమబాట పట్టిం చి తెలంగాణను సాధించిన కెసిఆర్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే నీటి రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ పకల్పన చేశారు. గోదావరి నదిలో 70 టిఎంసిల నీటిని ఉపయోగించుకుని వెనుకబడిన ప్రాంతాల బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో చేపట్టిన ఈ పథకం వల్ల భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల స్వరూపాలే మారిపోనున్నాయి. ఇప్పటికే ఎత్తిపోతల పథకం పనులు 70శాతం పైగా పూర్తయ్యాయి. భద్రాచలం పట్టణానికి ఎగువన దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీ నుంచి మూడు దశల్లో నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పనులు చకచకా జరిగిపోతున్నాయి. దుమ్ముగూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు హెడ్‌వర్క్ నుంచి ఆయకట్టు చివరి భూముల వరకూ మొత్తం 339కిలో మీటర్ల నిడివిన కాలువల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ఇందులో 327 కిలోమీటర్ల నిడివిన గ్రావిటి కెనాల్స్ కాగా, 3.85 కిలోమీటర్ల నిడివిన టన్నల్ నిర్మాణం,8.56 కిలోమీటర్ల మేరకు పంపింగ్ మెయిన్స్ తదితర పనులు జరుగుతున్నాయి.
2024 మార్చి నాటికి పనులు పూర్తి
సీతారామ ఎత్తిపోతల పథకం పనులు 2024 చివరి నాటికి పూర్తిచేయాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో చేపట్టిన ప్రక్రియలో భాగంగానే రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ రుద్రమకోట ఎత్తిపోతల పథకం ఆయకట్టులను కలుపుతూ సీతారామ ఎత్తిపోతల పథకం పేరుతో కొత్త రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని వందలాది గ్రామాలకు తాగునీటితో 6,74,387 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జిల్లాల పరిధిలో 3.28లక్షల ఎకరాల కొత్త ఎకరాల ఆయకట్టును సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా అందించే గోదావరి నది స్థీరీకరించనున్నారు.
ఎస్‌పివి ద్వారా నిధలు సమీకరణ
సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం నిధుల వ్యవయానికి ఏమాత్రం వెనుదీయకుండా కెసిఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ పథకం నిర్మాణం కోసం మొత్తం రూ.13384కోట్లు వ్యయం కాగలదని ప్రాథమిక అంచనా కాగా, నిధుల కోసం ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) ద్వారా నిధులను సమీకరించుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర నీటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా జాతీయ ఆర్థిక సంస్థలు, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసి) నుంచి ఆర్థ్దిక రుణ సహాయాలను అందిపుచ్చుకుంటోంది. వేనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదలే లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీతారామ ఎత్తిపోతల పథకం కింద మూడు దశల్లో విద్యుత్ మోటార్ల నిర్వహణ 715 మెగావాట్ల విద్యుత్ అవసరం అని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు ఏటా 1235.31 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ చార్జీల కింద ఏటా 617.65 కోట్లను రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలు వ్యవసాయరంగంలో కొత్త ఒరవడిని అందుకోనున్నాయి.