Friday, November 22, 2024

నిందలకు కాంగ్రెస్ ఓ ట్రేడ్‌మార్క్

- Advertisement -
- Advertisement -

Sitharaman swipe at Congress in Rajya Sabha

 ఆర్థికమంత్రి నిర్మల ఘాటు స్పందన
రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు జవాబు
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం
దీర్ఘ, తక్షణ ప్రయోజన దిశ
వచ్చే నెల 8కి ఎగువసభ వాయిదా

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రభుత్వంపై నిందలు వేయడం రివాజు అయిందని, ఇదే ఆ పార్టీ ట్రేడ్‌మార్క్ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. బడ్జెట్‌పై లోక్‌సభలో కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు ఆర్థిక మంత్రి శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానం దశలో ఉధృతస్థాయి ఎదురుదాడికి దిగారు. పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పాటుపడుతోందని, అయితే నిజాలను గ్రహించకుండా కేవలం నిందలకు వేయడం ఆ పార్టీ నైజం అయిందని విరుచుకుపడ్డారు. 202122 బడ్జెట్ ఆత్మనిర్భర్ భారత్ సాధక వాహకం అని, దీనిని ఈ పార్టీ వారు ఎందుకు గుర్తించడం లేదని సీతారామన్ ప్రశ్నించారు. ఓ వైపు తక్షణ స్వల్ప కాలిక పరిష్కారాలు ఇదే దశలో దీర్ఘకాలిక స్థిర ప్రగతి దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయి అనుభవం, నిర్వహణపరమైన సమర్థతల ప్రాతిపదికన రూపొందించడం జరిగింది.

ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సుదీర్ఘకాలం ప్రజలతో ఎన్నికైన ఘనత ఉన్న నేతకు దేశ ప్రగతి, సమున్నతి, సంస్కరణల పట్ల ఉన్న చిత్తశుద్థి, అంతకు మించిన అంకితభావం ఈ బడ్జెట్‌తో వెల్లడి అవుతోందని, దీనిని కేవలం నిందలేసే పద్ధతిలో ఉన్న కాంగ్రెస్ గుర్తించడం లేదని విమర్శించారు. లేదా అన్ని తెలిసినా నిజాలు అంగీకరించే ధైర్యం ఆ పార్టీకి లేదని విమర్శించారు. ప్రధాని ఆలోచనలు దేశ ప్రగతి సమగ్ర లక్షం ప్రాతిపదికననే బడ్జెట్ రూపకల్పన జరిగింది, బడ్జెట్ అంతర్లీన లక్షణాలను గుర్తిస్తే దీని స్వరూపం తెలిసివస్తుందన్నారు. ఆత్మనిర్భర భారత్ కీలక బిందువుగా బడ్జెట్ సాగిందని వివరించారు. పలు రకాల ఉద్దీపనలను దీర్ఘకాలిక, తాత్కాలిక ప్రయోజనాల కోణంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు ఉజ్వల భవిత అవసరం, ఇదే దశలో ప్రస్తుత తరుణంలో వారి తక్షణావసరాలు తీర్చే ఆర్థిక అవలంభన అత్యవసరంఅన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్, చిదంబరం ఇతరులు తీవ్రస్థాయి విమర్శలు చేశారు.

బడ్జెట్ ధనికుల కోసం ధనికులు చేపట్టిన ధనిక బడ్జెట్ అని, కేవలం దేశంలోని నాలుగు కుటుంబాలకు మరింత మేలు చేసే బడ్జెట్ అని బడ్జెట్‌పై దాడికి దిగారు. వాస్తవాలు గ్రహించకుండా ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని, పలు ప్రాతిపదికలతో చేపట్టిన చర్యల వల్ల దేశ ప్రగతిపథం సాగుతోందని, పలు రకాల సవాళ్లు ఎదురైనా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా పురోగమిస్తోన్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా స్థానం నిలబెట్టుకొంటోందని అన్నారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చారు. 8 కోట్ల మందికి వంటగ్యాసు అందించారు. రైతులు, మహిళలు ఇతరత్రా అన్ని వర్గాలకు మేలు జరిగిందని తెలిపారు. బడ్జెట్ కొందరి బాగునే ఉద్ధేశించుకుని వచ్చిన క్రోని సెంట్రిక్ అని రాహుల్ గాంధీ విమర్శించడంపై ఆర్థిక మంత్రి తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్ దామాద్‌గిరి

భారత జాతీయ కాంగ్రెస్‌కు అల్లుడితరహా పెద్దరికం (దామాద్‌గిరి) ఓ ట్రేడ్‌మార్క్ అయిందని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. ప్రభుత్వం తమకు అనుకూలుర కోసమే పనిచేస్తుందనే విమర్శలకు అర్థం లేదని అన్నారు. ప్రతి ఇంట్లో ఓ దామాద్ ఉంటాడని, దర్జాలు ఒలకబోస్తారని, అయితే ఈ దామాద్ దాదాగిరి కాంగ్రెస్ గుర్తు అయిందన్నారు. బడ్జెట్‌పై చర్చ ముగింపు దశలో ఆర్థిక మంత్రి సమాధానం ఘాటుగా వెలువడింది. ముద్ర యోజన పరిధిలో 27,000 కోట్ల రూపాయాల రుణాలు పొందారని, ఈ ముద్ర యోజన ప్రయోజనాలు ఎవరికి దక్కాయి? దామాద్‌లకా అని విరుచుకుపడ్డారు. బడ్జెట్‌పై చర్చ దీనికి సమాధానం ముగియడంతో బడ్జెట్ సెషన్ తొలి దశ ముగిసింది. మార్చి 8వ తేదీ వరకూ రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు సభాధ్యక్షులు ప్రకటించారు. బడ్జెట్ సెషన్ రెండో దశ మార్చి 8 నుంచి ఎప్రిల్ 8వరకూ సాగుతాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News