న్యూఢిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుఫాన్ కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 21 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతున్నదని.. ప్రస్తుతం సాగర్ దీవికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ పేర్కొంది. మరో 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు(మంగళవారం) ఉదయం బంగ్లాదేశ్‌లోని టికోనా దీవి వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. బెంగాల్-ఈశాన్య రాష్ట్రాల్లో సిత్రాంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. దీంతో బెంగాల్, మిజోరాం, మేఘాలయ, అసోంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మిజోరాంలో రెండు జిల్లాలు, మేఘాలయలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాన్ ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Sitrang Cyclone: Heavy Rain Alert to Bengal