ఎలాంటి కదలిక లేని జీవితం చాలా వ్యాధులకు అవకాశం కల్పిస్తుందని అందరికీ తెలిసిందే. అయితే కార్యాలయాల్లో కొన్ని గంటల పాటు కదలకుండా మెదలకుండా కుర్చీకి అతుక్కుపోయే ఉద్యోగులకు అనేక అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. దీనికి సరైన పరిష్కారాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ మేరకు మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్ అండ్ ఎక్సర్‌సైజ్ మేగజైన్‌లో పరిశోధన వివరాలు వెలువడ్డాయి. ఈ పరిశోధనలో నడివయస్సు, వృద్ధులైన 11 మందిని ఎనిమిది గంటల పాటు ల్యాబ్‌లో కూర్చుండబెట్టారు.
ఇది ఒక పనిదినాన్ని సూచిస్తుంది. ఐదు ప్రత్యేక దినాల్లో వారిని వివిధ విధాలుగా అధ్యయనం చేశారు. కొన్ని రోజుల్లో వారు ఎనిమిది గంటల్లో అప్పుడప్పుడు బాత్‌రూమ్‌కు వెళ్లేలా కాస్త విరామం కల్పించారు. మిగతా రోజుల్లో వారిని ప్రతి అరగంటకు ఒక నిమిషం పాటు కొన్నిసార్లు అలాగే ప్రతి అరగంటకు ఐదు నిమిషాలపాటు మరికొన్నిసార్లు నడిచేలా చేశారు. సుదీర్ఘ సమయం కూర్చుండిపోవడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలను సరిచేయడానికి కనీస వ్యాయామం కనుగొనడమే దీని ఉద్దేశం.
ఈ పరిశోధనలో గమనించేది ఏమంటే రోజంతా కూర్చుని ఉండే వారితో పోలిస్తే ప్రతి అరగంటకు తేలిక పాటి నడకతో బ్లడ్‌సుగర్ స్థాయిలను తగ్గించడానికి ఇదో వ్యూహం. ముఖ్యంగా ప్రతి అరగంటకు ఐదు నిమిషాల పాటు నడక వల్ల ఆహారం తీసుకున్నాక బ్లడ్‌సుగర్ స్థాయిలు దాదాపు 60 శాతం వరకు తగ్గాయని బయటపడింది. అందువల్ల ఈ పరిష్కారం చాలా సులభమైంది. కొన్నిగంటల పాటు కూర్చుండడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారించుకోవాలంటే ప్రతి అరగంటకు చిన్నపాటి నడక నడిస్తే మేలు జరుగుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.