సుందేష్‌ఖాలీ ( పశ్చిమబెంగాల్ ) : ఘర్షణలతో చిన్నాభిన్నమైన సుందేష్‌ఖాలీ ప్రాంతంలో పరిస్థితి భయంకంరంగా ఉందని, అరాచకానికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని సీనియర్ బీజేపీ నేత సువేందు అధికారి ధ్వజమెత్తారు. కోల్‌కతా హైకోర్టు నుంచి అనుమతి పొందిన తరువాత సుందేష్‌ఖాలీ ప్రాంతానికి మంగళవారం మధ్యాహ్నం ఆయన విచ్చేసారు. మరో బీజేపీ ఎంఎల్‌ఎ శంకర్ ఘోష్ ఆయన వెంట వచ్చారు.
ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడారు. పరారీలో ఉన్న షాజహాన్ షేక్‌తోసహా స్థానిక టిఎంసి నాయకుల నుంచి తాము ఎలాంటి వెన్ను వణికే అనుభవాలను ఎదుర్కొన్నామో స్థానికులు వివరించారు. ఢమకాలీ నుంచి కాళింది నది బోటుపై దాటుకొంటూ సుందేష్ ఖాలీకి వచ్చిన బీజేపీ నేతలకు స్థానికులు మహిళలతో సహా బీజేపీ నేతలకు స్వాగతం పలికారు.
స్థానికుల భూములు లాక్కున్నారని, మహిళలపై అఘాయిత్యాలు సాగాయని, ఇవన్నీ కూడా పోలీస్‌లు, అధికారుల సహకారంతో జరిగాయని , పరిస్థితి భయంకరంగా తయారై , అరాచకం రాజ్యమేలుతోందని సువేందు అధికారి ఆరోపించారు. మంగళవారం ఉదయం సువేందు అధికారిని పోలీస్‌లు అడ్డుకున్నారు. సుందేష్‌ఖాలీలో నిషేధాజ్ఞలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే కోర్టు అనుమతితో వారికి సుందేష్‌ఖాలీని సందర్శించడానికి వీలు కలిగింది.