కార్యకర్తలను ఏకం చేయలేని నాయకగణం
జిల్లా టిడిపి కార్యాలయానికి తమ్ముల్లంతా దూరం
విద్యానగర్: హైదరాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం మనుగడను కాపాడుకోవడానికి శ్రమించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ ఎంసి పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి పొలిట్ బ్యూ రో సభ్యుడు అర్వింద్ కుమార్‌గౌడ్ గ్రేటర్ కన్వీనర్ కాగా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లకు నలుగురు అధ్యక్షులు ఉన్నారు.
అరవింద్‌గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశాలకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వస్తున్నప్పటికి, ఆయన రాని సమయంలో జరిగే భేటిలు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడు సైతం పార్టీని వీడి వెళ్లిపోగా సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అంటే అధ్యక్షుడితోపాటు ఇద్దరు ప్ర ధాన కార్యదర్శులు, మరో నేత మాత్రమే అన్న చందంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో టిడిపికి ఒక్కసారిగా ఊపు వచ్చింది. సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పెద్ద ఎత్తునే కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చారు.
కానీ అదంతా అక్కడి ద్వితీయశ్రేణి నాయకత్వం చొరవ వల్ల జరిగిందే తప్ప పార్లమెంటరీ కమిటీ ప్రతినిధుల నుంచి వారికి ఎలాంటి మద్దతు లేక పోగా అందరినీ సమన్వయం చేయడంలోనూ సఫలం కాలేకపోయారు. బాబుకు ఐటి ఉద్యోగుల నుంచి వచ్చిన మద్దతు ఏకంగా అధికార పార్టీనీ షాక్ కు గురిచేయగా, కనీసం ఈ పరిణామాలను టిడిపికి అనుకూలం గా మార్చుకునే కార్యాచరణపైన ఎవరూ దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలమున్నా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారడానికి ఆ నలుగురే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబ సహా మరో ముగ్గురు నాయకులు మాత్రమే జిల్లా పార్టీ కార్యాలయాన్ని సొంతం అనుకుని ఇంకెవరిని రాకుండా చేస్తున్నారన్న విమర్శలు కింది స్థాయి కార్యకర్తల నుంచి వస్తున్నాయి.
పార్టీ కార్యక్రమాలపై ముందస్తు సమాచారం ఇవ్వకపోగా కార్యాలయానికి వచ్చిన వారికి ఏ విషయం చెప్పడం లేదని, పైగా పార్టీనీ తామే నడిపిస్తున్నట్టుగా ఉండే ఆ నలుగురి తీరు మిగిలిన కేడర్‌ను నియోజకవర్గాలకే పరిమితం చేస్తోంది. అధ్యక్షుడు ఏమీ చెప్పడం లేదని, తమకు ఇష్టమైన వారిని మాత్రమే పిలిపించుకుని ఫోటోలతోనే కార్యక్రమాలను కానిస్తున్నారని ఇప్పటికే కొందరు నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పార్టీ కార్యాలయం కంటే ఎన్టీఆర్‌భవన్‌కు వెళ్ళడమే బాగుందని సనత్‌నగర్‌కు చెందిన ఓ రాష్ట్ర నాయకు డు వ్యాఖ్యనించారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలోని స్థానిక సమస్యలను ఎండగడుతూ అప్పుడప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి రావడ మే మంచిదని మరికొందరు సీనియర్ నాయకులు చెపుతున్నారంటే ఆ నలుగురి ప్రభావం తెలుగుదేశాన్ని ఎటువైపు నడిపిస్తుందన్న సందేహం రాక తప్పదు.