సిటిబ్యూరోః నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లా, బిక్కోజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక నగరంలోని అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో పరిచయమైన శివరాం రాథోడ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరు తరచూ ఛాటింగ్ చేసుకునేవారు, కలుసుకునేవారు. అయితే శివరాం రాథోడ్‌కు వేరే యువతితో వివాహం నిశ్చయమైంది.
ఈ విషయం ప్రవళికకు తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ప్రవళిక మనస్థాపం చెంది హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను శిరాం రాథోడ్ చేతిలో మోసపోయానని సోదరుడు ప్రణయ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతి విషయం తెలుసుకున్న శివరాం రాథోడ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న చిక్కపల్లి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు.
హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన శివారం బంధువులు…
ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాం రాథోడ్ ఆచూకీ తెలుపాలని అతడి బంధువులు రాష్ట్ర మనవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్‌సిని వేడుకున్నారు. పరారీలో ఉన్న శివరాం ఆచూకీ తెలుపాలని చిక్కడపల్లి పోలీసులు తమ బంధువులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మానసికంగా వేధిస్తున్నారని, ఆచూకీ చెప్పకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు శివరాం ఆచూకీ తెలిస్తే పోలీసులకు తప్పనిసరిగా చెబుతామని అతడి బంధువులు అన్నారు. విచారణకు సహకరిస్తామని చెప్పినా కూడా పోలీసులు తమపై వేధింపులు ఆపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.