Friday, December 20, 2024

శివరాం రాథోడ్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రవళిక ఆత్మహత్య కేసులో అరెస్టైన శివరాం రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ జిల్లా, బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక నగరంలోని అశోక్‌నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ పోటీపరీక్షలకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ప్రవళిక హాస్టల్‌గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోటీపరీక్షలు వరుసగా వాయిదాపడడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ నెల 13వ తేదీన అశోక్‌నగర్ చౌరస్తాలో భారీ ఎత్తున ధర్నా చేశారు. ప్రవళికకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించమని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలోనే సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పారు. శివరాం రాథోడ్ అనే యువకుడు ప్రవళిక ప్రేమించుకున్నారని,

తనను కాకుండా వేరే యువతిని శివరాం వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. శివరాంను నిందితుడిగా పేర్కొంటు చిక్కడపల్లి పోలీసులు 420,417,306 ఐపిసి కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయినప్పుటి నుంచి పరారీలో ఉన్న శివరాం రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయేందుకు పిటీషన్ వేయగా కోర్టు నిరాకరించింది. కేసు దర్యాప్తులో ఉండగా లొంగిపోయేందుక అనుమతించమని స్పష్టం చేసింది. శివరాం నాంపల్లి కోర్టులో ఉన్నట్లు తెలియడంతో చిక్కడపల్లి పోలీసులు అక్కడికి వచ్చి అరెస్టు చేశారు. దీంతో శివరాం రాథోడ్ కోర్టులో బెయిల్ పిటీషన్ వేయగా, కేసులో ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు శివరాంకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించలేదని కోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News