పోలీస్‌ల అదుపులో 12 మంది… నిందితులంతా 20 ఏళ్ల లోపు వారే
శివమొగ్గ (కర్ణాటక) : శివమొగ్గ జిల్లాలో జరిగిన భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకేసులో ఇంతవరకు సుమారు 12 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఇరవై ఏళ్ల లోపు వారే. వీరిలో నిందితులు ఖాషిఫ్, సయ్యద్ నదీమ్, ఆసిఫ్,రిహాన్‌లను గుర్తించారు. ఖాసిఫ్, నదీమ్ వీరిద్దరూ శివమొగ్గకు చెందిన వారే వీరి పూర్వచరిత్ర, ఇతర వివరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం రాత్రి శివమొగ్గ పట్టణం లోని భారతీనగర్‌లో భజరంగ్‌దళ్ కార్యకర్త హర్షను హత్య చేయడానికి కారులో ఏడుగురు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శివమొగ్గ లోనే మకాం వేసి ఉన్న అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి ప్రతాప్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ నిందితులందర్నీ గుర్తించడమైందని, కొందర్ని అరెస్టు చేయడమైందని, మిగతా వారిని కూడా వేగంగా అరెస్టు చేస్తామని చెప్పారు.
పట్టణంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ మంగళవారం ఉదయం తుంగానగర్‌లో కొన్ని వాహనాలను అల్లరి మూకలు తగులబెట్టారని చెప్పారు. హత్య జరిగిన తరువాత పట్టణం లోను పరిసర ప్రాంతాల్లోను ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు లోకి తేడానికి అదనపు బలగాలు శివమొగ్గకు తరలి వెళ్లాయి. డిప్యూటీ కమిషనర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టడికి కావలసిన ఏర్పాట్లను చేశారని ఎడిజి ప్రతాప్ రెడ్డి తెలిపారు. పట్టణంలో హింసాత్మక, విధ్వంసక సంఘటనలు 14 వరకు జరిగాయని, వీటన్నిటిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు అదుపులో ఉన్న 12 మందిని ప్రశ్నిస్తున్నారని, హిజాబ్ వివాదం, మత సంస్థల పాత్ర, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ? దుండగులకు వాహనాన్ని ఎవరు సమకూర్చారు ? తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర విలేఖరులకు వెల్లడించారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదని, ఇలాంటి హత్యలకు ఫుల్‌స్టాప్ పడాలని ఆయన అన్నారు.
ఈ కేసుకు తార్కిక ముగింపు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. హిజాబ్ వివాదం ప్రారంభమైనప్పుడు ఈ హత్య జరిగిందని , అందువల్ల హిజాబ్ వివాదంతో ఈ హత్యకు సంబంధం ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక ఆరోపించారు. ఇదిలా ఉండగా కొందరు ముస్లిం బాలికలు హిజాబ్‌తో తమను తరగతుల్లోకి ప్రవేశించనీయడం లేదని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడంపై వ్యతిరేకంగా స్పందిస్తూ హిందూ విద్యార్థులు కాషాయం రుమాళ్లు ముఖానికి కప్పుకుని కాలేజీలకు రావడం ప్రారంభించారు. హిజాబ్, కాషాయం రుమాళ్ల ధారణ ట్రెండ్ క్రమంగా రాష్ట్రం లోని ఇతర ప్రాంతాల వ్యాపిస్తోంది. కొన్ని విద్యాసంస్థల్లో మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.ఇదిలా ఉండగా శివమొగ్గ జిల్లాలో కర్ఫూను మరో రెండు రోజులు అంటే శుక్రవారం ఉదయం వరకు పొడిగించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ అవసరాల కోసం బయటకు రావచ్చు. కర్ఫూ కాలంలో స్కూళ్లు, కాలేజీలు మూసే ఉంటాయి.