Saturday, October 26, 2024

నకిలీ పత్రాలతో రూ.600కోట్ల భూమి కొట్టేసేందుకు ప్లాన్

- Advertisement -
- Advertisement -

ఫోర్జరీ పత్రాలతో వందల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించిన ఆరుగురు నిందితులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రజాక్, గీక్ బిల్డర్ భాగస్వామి నవీన్‌కుమార్ గోయల్, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ జే. గురు సాయిరాజ్ సీనియర్ అసిస్టెంట్, ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్, బోరబండకు చెందిన ఎండి అబ్దుల్ ఆదిల్, సయిదా కౌసర్, అఫ్షా సారా కలిసి 12.09 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ విషయం తెలియడంతో శేరిలింగంపల్లి మండల తాహసిల్దార్ కూకల వెంకా రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో ఉన్న ఉన్న 12.09 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో ప్రభుత్వం తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టిఎస్‌ఎల్‌ఐపిసిఓ)కు కేటాయించారు.

చాలా ఏళ్ల నుంచి సంస్థ పొజిషన్‌లో ఉంది. 5.16ఎకరాల్లో భవనం నిర్మించగా, సర్వే నంబర్ 1,3,4,5,17,19,49లోని భూమి ఖాళీగా ఉంది. దీనిపై కన్నేసిన నిందితులు ఖాళీగా ఉన్న భూమిలో కమర్షిల్ కాంప్లెక్స్ కమ్ రెసిడెన్షీయల్ ప్లాట్స్ నిర్మించాలని ప్లాన్ వేశారు. 1978 ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసిన నిందితులు ఫైజుల్లా వారసులతో గీక్ బిల్డర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. వీరికి ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న గురుసాయిరాజ్ సహకరించి రిజిస్ట్రేషన్ చేశాడు. సర్వే నంబర్ 1,4,5,20లోని భూమి నిషేధిత జాబితాలో ఉన్నా కూడా సబ్ రిజిస్ట్రార్ నిందితులకు రిజిస్ట్రేషన్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం టిఎస్‌టిపిసికి రూ.202కోట్ల ప్రాజెక్ట్ కేటాయించడంతో భూమి వేరే వారి పేరుతో రిజిస్ట్రేషన్ అయిన విషయం బయటపడింది. వెంటనే రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై 318 (4), 316 (5), 338, 336 (3), 3 (2), 61 (2) బిఎన్‌ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఎసిపి రవీందర్ కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News