సినీ ఫక్కీలో కొందరు ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఒక రహస్య సొరంగం నుంచి వారు తప్పించుకున్నారు. రష్యా రాజధాని మాస్కోకు 300 కిమీ దూరంలో ఉన్న లిపెట్స్ ప్రాంతంలో ఈ సంఘటన బయటపడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు జైలులో అండర్‌గ్రౌండ్ టన్నెల్‌ను గుర్తించారు. దాంతో వెంటనే ఆ జైలులో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారో లెక్క తీశారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఆరుగురు ఖైదీలు పారిపోయినట్టు గుర్తించామని తెలిపారు.
దాంతో పోలీస్‌లు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. రష్యాలో నేరాలకు పాల్పడిన వారిపై త్వరితంగా విచారణ జరిపి జైళ్లకు పంపిస్తారు. అయితే రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. యుద్ధ రంగంలో ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా సైన్యం వారిని నియమించడమే అందుకు కారణం. ఇదిలా ఉంటే … రష్యాలో జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం చాలా అరుదు. ఒకవేళ వారు పారిపోయినా రోజుల్లో పట్టుబడతారని తెలుస్తోంది.