ఆరుగురి మృతి: 10 మందికి గాయాలు
చెన్నై: చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై చెంగల్పట్టు వద్ద రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలతోసహా ఆరుగురు ప్రయాణికులు మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. చెన్నై నుంచి చిదంబరం వెళుతున్న బస్సును మధురాంతకం నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొన్నట్లు చెంగల్పట్టు జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారిని చెంగల్పట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ సంతాపం
తమిళనాడులోని చెంగల్పట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంపై తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వారు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సిఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి అందచేయనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.