అప్రమత్తమైన ఒడిషా ప్రభుత్వం
భువనేశ్వర్: ఒడిషాలోని కార్లాప్యాట్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 14 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి కొలను సమీపంలో మరో ఆడ ఏనుగు మరణించడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరిందని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 1నుంచి నాలుగు ఆడ ఏనుగులు, ఒక ఏనుగు పిల్ల మరణించాయి. జంతు సంరక్షణా కేంద్రాల్లో వన్యమృగాలు చనిపోకుండా నిపుణుల సలహాలతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నీటి కొలనులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 2018 లెక్కల ప్రకారం కలహండి జిల్లాలోని కార్లాప్యాట్ కేంద్రంలో 17 ఏనుగులు ఉండేవి. 175 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కేంద్రం చిరుతపులులు, జింకలు, నక్కలు, తోడేళ్లు, అడవి పందులు, ఎలుగుబంట్లుసహా పలు రకాల జంతువులకు ఆవాసంగా ఉన్నది. హేమరేజ్ సెప్టీసీమియా వల్ల ఏనుగులు మరణించాయని డిఎఫ్‌ఒ అశోక్‌కుమార్ తెలిపారు. సంరక్షణా కేంద్రంలో ఇతర జంతువులేవీ మరణించలేదని ఆయన తెలిపారు.