Monday, December 23, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అమలాపురం వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికా లోని టెక్సాస్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ అమలాపురానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ముమ్మిడివరం వైఎస్‌ఆర్ పార్టీ ఎమ్‌ఎల్‌ఎ పి.వెంకట సతీష్‌కుమార్ బంధువులు. మృతుల్లో పి. నాగేశ్వరరావు, సీతామహలక్ష్మి, నవీనా, కృతిక్, నిషిధ,లతోపాటు ఆ కుటుంబానికి చెందిన మరొకరు ఉన్నారు. అమలాపురం నివాసి అయిన ఎమ్‌ఎల్‌ఎ కుమార్ తండ్రి సత్యారావుకి నాగేశ్వరరావు చిన్న తమ్ముడు. నాగేశ్వరరావు కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది. ఆమె అట్లాంటా నివాసి. టెక్సాస్ లోని క్లెబర్నె సిటీలో జాతీయ రహదారి 67 పై వీరంతా కారులో వస్తుండగా ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ఏడుగురు ఉండగా, ట్రక్కులో ఇద్దరు ఉన్నారు. కారులోని ఏడుగురిలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, లోకేష్ అనే ఒకేఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. లోకేష్‌ను చికిత్సకోసం విమానంలో ఆస్పత్రికి తరలించారు.

ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఎమ్‌ఎల్‌ఎ సతీష్‌కుమార్ తెలిపారు. ట్రక్కులో ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించారని అమెరికా మీడియా కథనం వివరించింది. ఈ ప్రమాదంలో ట్రక్కుదే పొరపాటని స్థానిక పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. “17 ఏళ్ల అమెరికా బాలుడు ట్రక్కులో వచ్చి కారును ఢీకొనడంతో మా చిన్నాన్న, పిన్ని , వారి కుమార్తె, ఇద్దరు మనుమలు, మరో బంధువు ప్రమాదంలో చనిపోయారని” ఎమ్‌ఎల్‌ఎ కుమార్ బుధవారం బాధపడుతూ చెప్పారు. ఈ కుటుంబం అంతా క్రిస్మస్ శెలవు దినాల సందర్భంగా టెక్సాస్ లోని తమ బంధువు ఇంటికి వెళ్లారు. జార్జియా స్టేట్ లోని అట్లాంటా నుంచి కారులో జూపార్కుకు వెళ్లి చూసి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ( తానా) ఆరుగురి మృతదేహాలను స్వదేశానికి పంపించడానికి సహకరిస్తోందని ఎమ్‌ఎల్‌ఎ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News