Wednesday, January 22, 2025

ఆరు గ్యారెంటీలు అద్భుతం

- Advertisement -
- Advertisement -

మహిళలకు ఉచిత బస్సు మంచి ఆలోచన
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు
వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఫిలిప్ గ్రీన్ భేటీ

మన తెలంగాణ / హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణం గురించి వారికి మంత్రి వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఆయా కోర్సుల్లో శిక్షణ అందించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రదేశమని అంగీకరించిన ఫిలిప్ గ్రీన్ రాష్ట్రానికి తమ దేశం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడానికి చొరువ తీసుకుంటామని స్పష్టం చేశారు.వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులపై అస్ట్రేలియా బృందంతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. వ్యవసాయ క్లస్టర్ల గురించి వివరించారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాల రూపకల్పన జరుగుతుందని, దళారి వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకే ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, దాని ఆధారిత రంగాలను మరింత లాభసాటిగా మార్చేందుకు యూనివర్సిటీలు, నిపుణులు, పరిశోధకులు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు.
వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిన్ గ్రీన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది. భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా మహిళలకు, అణగారిన వర్గాలకు, ఎల్జీబీటీఐఈ సమూహానికి ఎంటర్ ప్రేన్యూయర్ షిప్ లో స్టార్ట్ – ఎక్స్ పేరిట 13 వారాల పాటు వీ-హబ్ ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మహిళా సాధాకారత పునాదుల మీద తెలంగాణ వృద్ధి ఉంటుందని, దాన్ని తాము విశ్వసిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం, రూ. 500 కే ఎల్పీజీ సిలిండర్ కార్యక్రమం వంటివి చేపట్టామని వివరించారు. మహిళలకు సంబంధించి  క్షేత్రస్థాయి అంశాలు పరిష్కరించకపోతే వారు ప్రపంచంతో పోటీ పడడంలో అవరోధాలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వీ-హబ్ తో ఆస్ట్రేలియా ప్రభుత్వం భాగస్వామ్యం పట్ల ఆనందంగా ఉందని అన్నారు. అస్ట్రేలియా ప్రభుత్వం అందించిన తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, తదితరులు పాల్గొన్నారు.

Six guarantees are awesome

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News