న్యూఢిల్లీ: దేశ రాజధాని రామ్ లీలా మైదాన్ లో ఆదివారం నిర్వహించిన ప్రతిపక్షం ‘లోక్ తంత్ర్ బచావో’ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలను చదివి వినిపించారు. లోక్ సభ ఎన్నికల్లో విపక్ష కూటమి (ఇండియా) అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్తు, విద్య, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారని చదివి వినిపించారు. ‘‘ దేశంలో విద్యుత్తు కోతలు ఉండవు, పేదలకు ఉచిత విద్యుత్తు ఇచ్చే పూచీ నాది, ప్రతి పిల్లాడికి బడి ఉంటుంది, వాడల్లో మొహల్లా క్లినిక్ లు ఉంటాయి. ప్రతి మూల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటుంది. రైతులకు స్వామినాథన్ కమిటీ ఆమోదించిన రేట్లు ఉంటాయి. మా గ్యారంటీల్లో ఇవి భాగం. మా కూటమి తరఫున నేను భారత ప్రజలకు ఈ వాగ్దానం చేస్తున్నాను. 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోంది. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చుతాము’ అని సునీతా కేజ్రీవాల్ తన భర్త సందేశాన్ని చదివి వినిపించారు. ఇండియా బ్లాక్ ను గెలిపించితే మంచి ఆసుపత్రులు, విద్యతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు.
‘ప్రధాని మోడీ, నా భర్తను జైలులో వేశారు. ఆయన చేసింది సరైనదేనా? బిజెపి వాళ్లు నా భర్త పదవికి రాజీనామా చేయాలంటున్నారు. ఆయన రాజీనామా చేయాలా? ఆయన గతంలో అమరుడైన స్వాతంత్ర యోధుడి వంటివారు, ఈ జన్మలో అలాంటి స్వాతంత్ర్య పోరాటం చేయడానికే ఆయన మళ్లీ జన్మించి ఉంటారు’ అని సునీతా కేజ్రీవాల్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.