Sunday, January 19, 2025

వంద రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 100 రోజులలో అన్ని పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన మొదటి పండుగ సంక్రాంతి పండుగ అంటూ రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజా భవన్ ద్వారా ప్రజా పాలన నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వంద రోజులలో అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పండుగ సందర్భంగా పేదింటి ఆడబిడ్డలు బస్సుల్లో ఫ్రీ సౌకర్యం ద్వారా సొంత గ్రామాలకు వెళ్లారని అంటూ ఆర్‌టిసి బస్సులలో 30 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ వేశామని అన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్లతో హాస్టల్ నిర్మాణం, నల్లగొండ, ముషంపల్లి, కన్నేకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా 100 కోట్ల రోడ్డు పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గుండ్లపల్లి నుండి రేగట్ట వరకు 30 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, ధర్వేశిపురం వయా దోరేపల్లి,

పగిడిమర్రి వరకు 34 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. నల్లగొండలో డ్రైనేజీ, మిగిలిపోయిన రోడ్లు, ఇటీవల మున్సిపాలిటీలో విలీనం చేసిన చర్లపల్లి, మర్రిగూడెం, అర్జాల బావి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్‌పిటిసి వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News