కాఠ్మండ్ : నేపాల్‌లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న విదేశీయులు ఐదుగురు మెక్సికన్లతో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఆరుగురిలో హెలికాప్టర్ నడుపుతున్న కెప్టెన్ పైలట్ చెట్ గురుంగ్ కూడా ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మెక్సికన్ కుటుంబీకులు సిఫ్యుంటెస్ జి. ఫెర్మండో (95) ,సిఫ్యుంటెస్ రింకాన్ ఇస్మాయిల్ (98) పురుషులు కాగా, సిఫ్యుంటెస్ గొంగలెజ్ అబ్రిల్ (72). గొంగలెజ్ ఒలాసియో లూజ్ (65), సిఫ్యుంటెస్ జి. మేరియా జెసె (52) మహిళలుగా గుర్తించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
ఈ హెలికాప్టర్ (మనంగ్ ఎయిర్ ఎన్‌ఎఎంవి చాపర్ ) సోలుకుంభు జిల్లా సుర్కె విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 10.04 గంటలకు కాఠ్మండ్‌కు బయలు దేరింది. బయలుదేరిన పది నిమిషాల్లో 12,000 అడుగుల ఎత్తులో ఉదయం 10.13 గంటలకు కంట్రోల్ స్టేషన్‌తో హెలికాప్టర్‌కు సంబంధాలు తెగిపోయాయని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (టిఐఎ) మేనేజర్ గ్యానేంద్ర భుల్ తెలియజేశారు. విహారయాత్ర గడిపి వీరు సుర్కే నుంచి కాఠ్మండ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని టిఐఎ అధికార ప్రతినిధి టేక్‌నాథ్ సిటౌలా చెప్పారు.
లిఖుపికే రూరల్ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్తానికులు అధికారులకు సమాచారం అందించడంతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి స్థానికులు , పోలీస్‌లు చేరుకుని మృతులను గుర్తించారు. వాతావరణం అనుకూలించక పోవడంతో రెండు హెలికాప్టర్లు అదే జిల్లా లోని భకంజే ప్రదేశానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మృతదేహాలను కాఠ్మండ్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ పర్యాటక , పర్వతారోహణ సీజన్ మేతో ముగిసింది. ఈ సమయంలో టూరిస్టులను పర్వతాల వద్దకు తీసుకెళ్లడం కష్టం . వాతావరణం సరిగ్గా లేక దారితెన్సూ స్పష్టంగా కనిపించదు.