ఆరుగురు మృతి… 30 మందికి తీవ్ర గాయాలు
హైలాండ్ పార్క్ ( అమెరికా): అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ పెరేడ్‌లో కూడా తుపాకీ కాల్పులు తప్పడం లేదు. అమెరికా లోని చికాగో శివారు ప్రాంతంలో సోమవారం 10.15 గంటల ప్రాంతంలో ఓ దుండగుడు విచ్చల విడిగా కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు ఓ రిటైల్ స్టోర్ పైకి ఎక్కి అక్కడి నుంచి పరేడ్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని రాబర్ట్ క్రిమో (22)గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రాబర్ట్ క్రిమో కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. అతడు పారిపోతుండగా, ట్రాఫిక్ అధికారులు వెంబడించి అదుపు లోకి తీసుకున్నారు. అతడిని షూటింగ్‌లో పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా పోలీస్ శాఖ ప్రకటించింది. నిందితుడు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌ను ఉపయోగించాడని లేక్ కౌంటీ మేజర్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఈ రైఫిల్‌ను ఎక్కడ కొన్నాడో దానిపై దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ప్రదేశంలో దుకాణం గోడకు ఓ నిచ్చెన వేసి ఉందని, దుకాణం పైన కాల్పులు జరిపిన ఆనవాళ్లను గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. కాల్పులు ప్రారంభం కాగానే అక్కడ ఉన్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటన షాక్‌కు గురి చేసింది : జోబైడెన్
ఈ కాల్పుల ఘటనతో హైలాండ్ ప్రాంతంలో వేడుకలను రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. ఈ ఘటన తనను , ప్రధమ మహిళ జిల్ బైడెన్‌ను షాక్‌కు గురి చేసిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.