ఎన్‌ఎస్‌పిలో ముగ్గురు, స్వర్ణముఖిలో మరో ముగ్గరు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు సరదాగా ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో ఎన్‌ఎస్‌పి కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైనవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌ఎస్‌పి కాలువలో స్నానానికి ఏడుగురు వ్యక్తులు దిగగా ప్రమాదవశాత్తు వివేక్, అభయ్, సోనూ కాలువలో మునిగిపోయారు. ఈ ముగ్గురు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారని పోలీసులు వివరిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం సమీపంలో స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకోసం మొత్తం నలుగురు విద్యార్థులు వెళ్లగా వారిలో జి.పాలెం ఎస్‌సి కాలనీకి చెందిన ధోని(16), గణేష్(15), యుగంధర్(14) గల్లంతయ్యారు. లిఖిత్ సాయి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. కానీ.. ఆచూకీ లభించలేదు. అనంతరం.. రేణిగుంట పోలీసులు, రెస్క్యూ టీం స్వర్ణముఖి నది వద్దకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.