ప్రశాంతంగా ఉన్న పినపాక ఏజెన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గిరిజల గ్రామాల్లో తుపాకుల మోతతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురయ్యారు. గురువారం ఉదయం కరకగూడెం మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామ శివారులు మావోయిస్టులకు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని లచ్చన్న దళ సభ్యులుగా పోలీసులు నిర్ధారించారు. గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విలేకరులతో మాట్లాడుతూ గత కొంతకాలంగా మణుగూరు ఏరియాలో నిషేధిత మావోయిస్టుకు చెందిన లచ్చన్న దళం సంచరిస్తుందన్న సమాచారంతో గురువారం ఉదయం కరకగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతె అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు నిషేధిత సిపిఐ మావోయిస్టు ధళ సభ్యులు ఎదురుపడి పోలీసులపై కాల్పులు జరిపారని అన్నారు. ఆనంతరం పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటికి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు.
అదేవిధంగా ఇద్దరు పోలీసులకు స్పల్పగాయాలు జరిగినట్లు తెలిపారు. గాయపడిన పోలీసులను భద్రాచలం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని మృతుల్లో మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటి కార్యదర్శి లచ్చన్న దంపతులు ఉన్నారు. మృతి చెందిన వారి వివరాలు 1.లచ్చన్న అలియాస్, వీరయ్య, 2. శుక్రాం, 3.తులసీ, 4.దుర్గేష్, 5.రాము, 6.కోసి ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఏకే 47 ఆయుధాలు 02, ఎస్‌ఎల్‌ఆర్ 01, 303 రైపిల్ 01, పిస్టల్ 01, మ్యాగ్జిన్‌లతో పాటు కిట్ బ్యాగులు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎదురు కాల్పుల్లో మరో మావోయిస్టు పారిపోయాడనే సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
పినపాక ఏజెన్సీలో మావోయిస్టుల సంచారం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేత పటిష్టంగా అమలు చేయడంతో ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయి, పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్‌కు తమ కార్యకలాపాలను విస్తరించారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలనే లక్షంతో ఛత్తీస్‌గడ్‌కు నుంచి భద్రాద్రి, ములుగు జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతరామరాజు డివిజన్ కమిటీ లచ్చన్న అలియాస్ వీరయ్య దళం సంచరిస్తుందనే సమాచారం అందినట్లు తెలుస్తుంది. గత నెల రోజులుగా స్పెషల్ పార్టీ పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నాయి. జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఛత్తీస్‌గడ్‌కు మావోయిస్టులు వెళ్లలేరనే లక్షంతో గురువారం కరకగూడెం మండల పరిధిలో లచ్చన్న దళం ఉందన్న సమాచారంతో భారీ సంఖ్యలో పోలీసులు బూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. పక్కా ప్లాన్‌తో ఉన్న పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల కారణంగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు జగన్ మృతి చెంది 24గ ంటల కాకముందే మరో అగ్రనేత లచ్చన్న మృతి చెందడం మావోయిస్టులకు ఎదురుదెబ్బగానే భావించాలి.
రఘునాథపాలెం ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహుల పనే: ఆజాద్
రఘునాథపాలెం ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహుల వల్ల జరిగిందని మావోయిస్టు పార్టీ పత్రిక ప్రకటనను కేంద్ర కమిటీ సభ్యులు ఆజాద్ పేరుతో విడుదల చేసింది. రఘునాథపాలెం ఎన్‌కౌంటర్‌లో తమ పార్టీ డివిజన్ సభ్యులు కామ్రేడ్ లచ్చన్నతో పాటు మరో 5గురు సభ్యులు మృతి చెందారని తెలిపారు. త్యాగాలు తమ పార్టీకి కొత్త కాదని, ఎన్‌కౌంటర్‌లకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. పోలీసులు జరిగిన ఎన్‌కౌంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తగిన మూల్యం చెల్లించుకుంటామని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులకు సంఘీభావంగా 9న బంద్ పాటిస్తున్నామని, ప్రజలు, వ్యాపార వర్గాలు బంద్‌కు సహకరించాలని లేఖలో పేర్కొన్నారు.