మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టులో కొత్తగా ఆరుగురిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం సిఫారసు చేసింది. న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫారసులో వెల్లడించింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నేగేశ్ భీమపాక, నామవరపు రాజేశ్వరరావు, కాజా శరత్ , పుల్ల కార్తీక్, జగ్గన్నగారి శ్రీనివాసరావులున్నారు. వీరిని సుప్రీం కొలీజియం సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు సదరు న్యాయాధికారుల పేర్లను కొలీజియం కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం పదవీ బాధ్యతలు చేపడుతారు. రాష్ట్రంలో ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్తో సహా 27 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. తాజా ఉత్తర్వులతో 27 మందికి మరో ఆరుగురు న్యాయమూర్తులను నియమించడంతో సంఖ్య 33కు చేరనుంది.